Begin typing your search above and press return to search.

పూరి చేతిలో పడి ఎలా తయారవుతాడో..

By:  Tupaki Desk   |   30 April 2016 9:34 AM GMT
పూరి చేతిలో పడి ఎలా తయారవుతాడో..
X
హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా తన సినిమాల కోసం చాలా కష్టపడుతుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్. అతడి కష్టం తెర మీద స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇతడికో సక్సెస్ వస్తే బాగుంటుందే అని అందరూ కోరుకునే హీర్లో కళ్యాణ్ రామ్ పేరు ముందుంటుంది. గత ఏడాది ‘పటాస్’ సినిమా సక్సెస్ అయినపుడు ఇండస్ట్రీలో మెజారిటీ జనాలు సంతోషించారు. కానీ ‘షేర్’ సినిమాతో మళ్లీ పాత దారిలోకి వెళ్లిపోయాడు కళ్యాణ్. నిర్మాతగా ‘కిక్-2’ సైతం పెద్ద డిజాస్టర్ కావడంతో నందమూరి హీరో తిరిగి యథాస్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా అతడికో సక్సెస్ అవసరం. ఇలాంటి టైంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమాకు రంగం సిద్ధం చేసి ఆశ్చర్యపరిచాడు కళ్యాణ్ రామ్.

కళ్యాణ్ ఇప్పటిదాకా స్టార్ డైరెక్టర్లతో పని చేసింది లేదు. అతడితో పని చేసిన దర్శకులు స్టార్లయ్యారు కానీ.. అతనెప్పుడూ స్టార్ దర్శకులతో సినిమాలు చేయలేదు. తొలిసారి పూరి లాంటి ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ తో పని చేస్తుండటంతో ఈ సినిమాలో అతనెలా కనిపిస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. ప్రభాస్ అన్నట్లు హీరో క్యారెక్టరైజేషన్ మీదే కథలు నడిపే అరుదైన దర్శకుల్లో పూరి ఒకడు. మహేష్ బాబు.. ప్రభాస్.. ఎన్టీఆర్.. ఇలా చాలామంది స్టార్ హీరోల్ని తనదైన శైలిలో ప్రెజెంట్ చేసి.. వాళ్లకు తన సినిమాలతో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తీసుకొచ్చాడు పూరి.

మరి కళ్యాణ్ రామ్ లాంటి స్టార్ ఇమేజ్ లేని హీరోను ఎలా చూపిస్తాడో చూడాలి. నిన్న ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా పూరి మాట్లాడుతూ.. సరికొత్త.. డైనమిక్ కళ్యాణ్ రామ్ ను చూడబోతున్నారంటూ హింట్ ఇచ్చాడు. దీన్ని బట్టి ఈ సినిమా కూడా హీరో క్యారెక్టరైజేషన్ మీదే నడుస్తుందని అనుకోవచ్చు. కళ్యాణ్ రామ్ పోషించబోయేది జర్నలిస్టు పాత్ర కావడం విశేషం. ఇప్పటికే ‘కెమెరామన్ గంగతో రాంబాబు’లో పూరి హీరో జర్నలిస్టే. మరి దానికి భిన్నంగా కళ్యాణ్ రామ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.