కృష్ణ చేసిన తప్పే చిరు కూడా..

Wed May 23 2018 23:59:22 GMT+0530 (IST)

మాయాబజార్.. మరో చరిత్ర.. శంకరాభరణం.. మౌనరాగం.. తెలుగులో క్లాసిక్స్ గా నిలిచిపోయిన సినిమాలు. ఈ టైటిళ్లు పెట్టుకుని తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆడలేదు. ఆ సినిమాల గౌరవాన్ని తగ్గించేలాగా ఆ సినిమాలు తయారయ్యాయి. దీంతో ఏదైనా పాత క్లాసిక్ మూవీ టైటిల్ ను ఒక కొత్త సినిమాను పెడుతున్నారంటే జనాలు దడ పుడుతుంది. అందులోనూ సినీ పరిశ్రమలోని వారసులు తమ ఫ్యామిలీలోని లెజెండ్స్ కెరీర్లలో ల్యాండ్ మార్క్ లాగా నిలిచిపోయిన సినిమాల టైటిళ్లు వాడితే ఈ భయం మరింత ఎక్కువగా ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచిన ‘మోసగాళ్లకు మోసగాడు’ను ఆయన అల్లుడు సుధీర్ బాబు వాడుకుంటానంటే ఆయన అభ్యంతరం చెప్పలేదు. కనీసం మహేష్ బాబు ఈ పేరుతో సినిమా చేసినా ఓకే. అభిమానులు ఓన్ చేసుకుంటారు. కానీ సూపర్ స్టార్ ఫ్యామిలీలోకి అల్లుడిగా వచ్చిన వ్యక్తి ఆ టైటిల్ వాడుకోవడం జనాలకు నచ్చలేదు. ఇది కృష్ణ ఫేమ్ ను వాడుకున్నట్లే అనిపించింది. ఆ సినిమా ఫలితమేంటో తెలిసిందే. ఒక సాధారణ సినిమాకు అలాంటి లెజెండరీ టైటిల్ పెట్టడం కృష్ణ అభిమానులకు నిరాశ కలిగించింది.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఇదే బాటలో నడిచాడు. హీరోగా తన తొలి సినిమాకు ‘విజేత’ అనే పేరు పెట్టుకున్నాడు. ఈ పేరుతో తెరకెక్కిన చిరు సినిమా ఆయన కెరీర్లో మైలురాయిలా నిలిచింది. చిరు చేసిన అద్భుతమైన సినిమాల్లో అదొకటి. కమర్షియల్ గా ఎంత సక్సెస్ అయిందన్న దాన్ని పక్కన పెడితే ఒక గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అలాంటి సినిమా టైటిల్ ను తన తొలి సినిమాకే కళ్యాణ్ పెట్టేసుకోవడం ‘వాడకం’ తప్ప మరేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం హీరోగా ఒక గుర్తింపు తెచ్చుకునే వరకైనా ఆగకుండా తొలి సినిమాకే ఇలా చిరు టైటిల్ వాడేసుకోవడమేంటి? ఇందుకు మెగా ఫ్యామిలీ అయినా ఎలా అంగీకరించింది అన్నది అర్థం కాని విషయం. అంత గొప్ప సినిమా టైటిల్ పెట్టుకుని సినిమాలో అందుకు తగ్గ కంటెంట్ లేకుంటే అది సినిమాకు చేటు చేస్తుందే తప్ప ఇంకేమీ కాదు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.