ఇంకో బాబు సరసన కాజల్

Sun Jun 24 2018 22:21:45 GMT+0530 (IST)

సినీ పరిశ్రమలో ఎప్పుడూ వారసత్వ హవా నడుస్తుంటుంది. అందులోనూ టాలీవుడ్లో ఇది మరీ ఎక్కువ. గత కొన్నేళ్లలో అయితే వారసత్వ హీరోలు ఇబ్బడిముబ్బడిగా వచ్చేశారు ఇండస్ట్రీలోకి. అందులో నిర్మాతల కొడుకులు కూడా చాలామందే ఉన్నారు. బెల్లంకొండ సురేష్ కొడుకైన శ్రీనివాస్ పెద్ద పెద్ద దర్శకులతో భారీ సిినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అతడి సరసన సమంత.. రకుల్ ప్రీత్.. పూజా హెగ్డే.. ఇలా వరుసగా స్టార్ హీరోయిన్లే నటిస్తున్నారు. ‘సాక్ష్యం’ తర్వాత శ్రీనివాస్ చేయబోయే కొత్త సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే.కాజల్ దీని తర్వాత మరో నిర్మాత కొడుక్కి జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. ఆ హీరో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కొడుకు. ‘భరత్ అనే నేను’తో టాప్ ప్రొడ్యూసర్ల లీగ్ లోకి చేరిన దానయ్య.. రామ్ చరణ్-బోయపాటి శ్రీను ప్రాజెక్టుతో పాటు రాజమౌళి మల్టీస్టారర్ ను నిర్మిస్తున్నాడు. ఈ సమయంలోనే తన కొడుకుని హీరోను చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు తేజ రూపొందించబోతున్నాడు. స్క్రిప్టు కూడా రెడీ అయినట్లు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ నుంచి బయటికొచ్చాక తేజ దీని మీదే ఫోకస్ చేస్తున్నాడు. తనకు కథానాయికగా తొలి అవకాశం ఇచ్చిన తేజ కోసమే కొంచెం తన రేంజ్ తగ్గించుకుని ‘నేనే రాజు నేనే మంత్రి’లో చేసిన కాజల్.. తన గాడ్ ఫాదర్ కొత్త సినిమాలో ఒక కొత్త కథానాయకుడికి జోడీగా నటించడానికి కూడా అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.