Begin typing your search above and press return to search.

200 కేజీల ఐస్‌ గడ్డల్ని మీదేసుకున్నా!

By:  Tupaki Desk   |   20 May 2019 4:25 AM GMT
200 కేజీల ఐస్‌ గడ్డల్ని మీదేసుకున్నా!
X
ద‌శాబ్ధం పైగా కెరీర్ లో ఆకాశం ఎత్తుకు ఎదిగింది చంద‌మామ‌. స్టార్ హీరోయిన్ గా అగ్ర‌తాంబూలం అందుకుని దానిని రెండు ద‌శాబ్ధాల పాటు కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఓవైపు యువ‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తూనే మ‌రోవైపు స్టార్ హీరోల‌తో సెల‌క్టివ్ గా ముందుకెళుతోంది. కాజ‌ల్- బెల్లంకొండ శ్రీ‌ను జంట‌గా తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `సీత` ఈనెల 24న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ మీడియాకు కాజ‌ల్ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది.

నవతరం అమ్మాయిల జీవితాల్ని ప్రతిబింబించే పాత్ర సీత. క‌ల‌ల్ని నిజం చేసుకునేందుకు స్వార్థం చూపించే మ‌గువ‌గా క‌నిపిస్తాను. న‌టించేందుకు గొప్ప ఆస్కారం ఉన్న పాత్ర ఇది. తేజ స‌ర్ ఒక గొప్ప పాత్ర‌లో అవ‌కాశం ఇచ్చారు. ఇక సీత పాత్ర‌లో న‌టించ‌డం కోసం ఆ పాత్ర‌ను అర్థం చేసుకునేందుకు చాలా పుస్త‌కాలు చ‌దివాను. మ‌నుషుల్ని ప‌రిశీలించాను. స్వ‌త‌హాగానే నాకు పౌరాణికాలంటే చాలా ఇష్టం. కానీ వాటితో ఏమాత్రం సంబంధం లేని పాత్ర సీత‌. నేటి త‌రం అభిన‌వ సీత‌కు ప్ర‌తిబింబంలా ఉంటుంది.

సీత సాహసాల క‌థేమి? అని ప్ర‌శ్నిస్తే.. ``సీత సాఫ్ట్ కాదు .. సాహ‌సాలు చేసే వీర‌వ‌నిత. ఇందులో నేను చేసిన సాహ‌సాలు ఒంటిని గ‌గుర్పాటుకు గురి చేస్తాయి. 200 కేజీల బరువున్న ఐస్‌ గడ్డల్ని నాపై వేసుకుని నటించాను. ఆ స‌న్నివేశంలో న‌టించేప్పుడు నా క‌ష్టం పైవాడికే తెలుసు. అంతేనా ఈ సినిమాలో కొన్ని రియ‌ల్ ఫైట్స్ చేశాను. డేరింగ్ ఫీట్స్ ఎన్నో తెర‌పై అల‌రిస్తాయి. వాటికోసం ఎంతో శ్ర‌మించాల్సొచ్చింది. ఒంటికి గాయాలు అయ్యాయి. ఎప్పుడూ సెట్‌ లో ఓ డాక్ట‌ర్ ట్రీట్ మెంట్ కి రెడీగా ఉండేవారు...`` అంటూ బోలెడు సంగ‌తుల్ని కాజ‌ల్ తెలిపారు.

అస‌లింత‌కీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు ఓకే అయ్యింది? అన్న ప్ర‌శ్న‌కు.. తేజ గారు ఎప్పుడో క‌థ చెప్పారు. కానీ కాల్షీట్లు కుద‌ర‌లేదు. నేనే రాజు నేనే మంత్రి’ సినిమా షూట్‌ లో ఈ సినిమాను నాతోనే చేయాలి అని ప్రామిస్ తీసుకున్నా. నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేసి సినిమా తీశారని వెల్ల‌డించారు.