Begin typing your search above and press return to search.

కబాలి తెలుగులోనూ కొట్టాడుగా...

By:  Tupaki Desk   |   30 May 2016 3:30 PM GMT
కబాలి తెలుగులోనూ కొట్టాడుగా...
X
మే 1వ తేదీ ఉదయం 11 గంటలకు యూట్యూబ్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ‘కబాలి’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి రికార్డుల మీద మీద రికార్డులు కొడుతూ దూసుకెళ్లిపోతున్నాడు సూపర్ స్టార్. ఇప్పటికే ఏకంగా 2 కోట్ల వ్యూస్ తో ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మరే సినిమా టీజర్ కూ సాధ్యం కాని రికార్డు నెలకొల్పింది రజినీ సినిమా. దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఓ రీజనల్ హీరో ఇలాంటి రికార్డు సాధించడం ట్రేడ్ పండిట్లకు కూడా అర్థం కావట్లేదు. తాజాగా ‘కబాలి’ ఖాతాలో మరో రికార్డు చేరింది.

‘కబాలి’ తెలుగు టీజర్ 30 లక్షలకు పైగా హిట్స్ సంపాదించింది. ఏ భాషలో అయినా సరే.. ఓ డబ్బింగ్ సినిమా టీజర్ కు ఇన్ని హిట్స్ రావడం అన్నది ఇదే తొలిసారి. తెలుగులో సైతం రజినీకి ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ. 30 లక్షల వ్యూస్ అంటే తెలుగులో స్టార్ హీరోల టీజర్లకు మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్లకు రజినీ ఏమాత్రం తీసిపోడని ‘కబాలి’ టీజర్ రుజువు చేసింది. అందులోనూ తెలుగు టీజర్ కొంచెం లేటుగా రిలీజవడం వల్ల వ్యూస్ తగ్గాయి. తమిళంతో పాటే విడుదలై ఉంటే లెక్క వేరుగా ఉండేది. ఈ క్రేజ్ చూసే ‘కబాలి’ తెలుగు హక్కుల్ని రూ.30 కోట్లకు పైగా అడుగుతున్నారట బయ్యర్లు. పోటీ గట్టిగానే ఉంది. ఇంకా హక్కులు ఎవరికీ కట్టబెట్టలేదు. జులై 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.