Begin typing your search above and press return to search.

కబాలి.. లింగా మాత్రం కాదు

By:  Tupaki Desk   |   24 July 2016 4:33 AM GMT
కబాలి.. లింగా మాత్రం కాదు
X
రజినీకాంత్ సినిమా అయితే బ్లాక్ బస్టర్.. లేదంటే డిజాస్టర్. యావరేజులు.. ఎబోవ్ ఏవరేజులు లాంటివేమీ ఉండవు. దశాబ్దంన్నరగా ఆయన సినిమాల ఫలితాల్ని పరిశీలిస్తే ఆ సంగతి అర్థమవుతుంది. నరసింహా..చంద్రముఖి.. శివాజీ.. రోబో బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. బాబా.. కథానాయకుడు.. విక్రమసింహా.. లింగా డిజాస్టర్లుగా మిగిలాయి. రజినీ సినిమాలంటే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తగ్గట్లే భారీగా బిజినెస్ జరుగుతుంది. భారీ హైప్ మధ్య సినిమా విడుదలవుతుంది. పాజిటివ్ టాక్ వస్తే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది. భారీ వసూళ్లు.. భారీ లాభాలు వస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చిందంటే అంతే సంగతులు. భారీ నష్టాలు తప్పవు. అందుకే అయితే బ్లాక్ బస్టర్ లేదంటే డిజాస్టర్ అన్నట్లు తయారైంది పరిస్థితి.

మరి రజినీ కొత్త సినిమా ‘కబాలి’ పరిస్థితేంటన్నది ఆసక్తికరం. ఈ సినిమాకు చాలా వరకు నెగెటివ్ టాకే వచ్చింది. దీనికంటే బెటర్ టాక్ సంపాదించుకున్న ‘లింగా’ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. అలాంటపుడు ‘కబాలి’ కూడా ఆ సినిమా తరహాలోనే డిజాస్టర్ కావాలి. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఈ సినిమా మీద హైప్ మరీ పెరిగిపోవడంతో వీకెండ్ మొత్తానికి టికెట్లు ముందే బుక్ అయిపోయాయి. ఆదివారం లోపు టికెట్లు దొరకని వాళ్లు సోమవారం.. ఆ తర్వాతి రోజులకు కూడా టికెట్లు బుక్ చేసుకున్నారు. అందుకే తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినా.. రెండో రోజు కూడా కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. పైగా ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా పది వేల దాకా థియేటర్లలో రిలీజ్ చేశారు. కాబట్టి ఓపెనింగ్స్ అనూహ్యంగా వస్తున్నాయి. తొలి వీకెండ్లోనే అన్ని ఏరియాల్లోనూ 60-70 శాతం దాకా పెట్టుబడి రికవరీ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అయినా.. బయ్యర్లు తక్కువ నష్టాలతో బయటపడే ఆస్కారముంది. కాబట్టి ‘కబాలి’.. ‘లింగా’లా తయారవుతుందని మరీ భయపడాల్సిన పని లేదు.