Begin typing your search above and press return to search.

మూడేళ్ల పాటు 42 వెర్ష‌న్లు రాశాడ‌ట‌!

By:  Tupaki Desk   |   11 July 2019 5:30 PM GMT
మూడేళ్ల పాటు 42 వెర్ష‌న్లు రాశాడ‌ట‌!
X
ఒక సినిమాకి నాలుగైదు వెర్ష‌న్లు రాయ‌డ‌మే అసాధార‌ణం అనుకుంటే.. ఈయ‌న ఏకంగా 42 వెర్ష‌న్లు రాసుకున్నాడ‌ట‌. ఇంత‌కీ ఏ సినిమా స్క్రిప్టు... అంటే? శివాత్మిక రాజ‌శేఖ‌ర్- ఆనంద్ దేవ‌ర‌కొండ జంట‌గా న‌టించిన `దొర‌సాని` స్క్రిప్టును ద‌ర్శ‌కుడు కె.వి.ఆర్‌. మ‌హేంద్ర 42 వెర్ష‌న్లు రాసుకుని అందులోంచి ఒక‌టి ఫైన‌ల్ చేసుకుని తెర‌కెక్కించార‌ట‌. ఈ శుక్ర‌వారం(జూలై 12) దొరసాని రిలీజ్ సంద‌ర్భంగా మీడియా ఇంట‌ర్వ్యూలో ఈ టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు.

ఆయ‌న స్వ‌గ‌తం గురించి ముచ్చ‌టిస్తూ.. మాది వరంగల్ జిల్లాలోని జయగిరి అనే విలేజ్. అందరిలానే ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించాను. `నిశీధి` అనే ల‌ఘు చిత్రం నా జీవితాన్నే మార్చేసింది. ఆ ల‌ఘు చిత్ర‌మే నన్ను నాకు పరిచయం చేసింది. అది చూసి ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ నాకు ఓ మెయిల్ పంపించారు. నా ద‌ర్శ‌క‌త్వాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగి కొత్తగా చేయాలనే ప్ర‌య‌త్నంలో దొర‌సాని తార‌స‌ప‌డింది.. అని తెలిపారు. `నిశీధి` త‌ర్వాత మూడేళ్ల పాటు ఏ ప‌నీ చేయ‌కుండా కేవ‌లం దొరసాని స్క్రిప్ట్ రాశాను. దీనికి 42 వెర్ష‌న్లు రాసుకున్నాను! అని తెలిపారు.

అంత‌గా దొర‌సానిలో ఏం కొత్త‌ద‌నం ఉంటుంది? అన్న ప్ర‌శ్న‌కు మ‌హేంద్ర మాట్లాడుతూ.. ప్రేమ‌క‌థ‌లెన్నో వ‌స్తే దొర‌సానినే ఎందుకు చూడాలంటే ఈ సెట‌ప్ కొత్త‌గా ఉంటుంది. ఆ ప్ర‌పంచ‌మే వేరు. 2.10 గం.లు ఓ కొత్త ప్ర‌పంచంలోకి వెళ్లిన అనుభూతి క‌లుగుతుంది. నాడు నైజాంలో దొరల‌ వ్యవస్థ కు ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను జోడించాను. అస‌లు ఆ ప్ర‌పంచాన్ని అర్థం చేసుకునేందుకే దాదాపు ఎనిమిది నెలలు ఆ స్టోరీ వరల్డ్ కి సంబంధించి పుస్త‌కాలు చ‌దివాను అని వెల్ల‌డించారు. ఫ్యూర్ లవ్ స్టోరీలో సంఘ‌ర్ష‌ణ న‌చ్చుతుంది. క‌థ‌లోని స్వ‌చ్ఛ‌త‌- నిజాయితీ మెప్పిస్తుంద‌ని అన్నారు. ఈ చిత్రంలో దొర‌సాని పాత్ర‌లో శివాత్మిక .. రాజు పాత్రలో ఆనంద్ ఒదిగిపోయి న‌టించారు. ఆ ఇద్ద‌రూ ఎంతో స‌హ‌జంగా తెర‌పై క‌నిపిస్తార‌ని వెల్ల‌డించారు. దొర‌సాని పాత్ర‌కు శివాత్మిక స‌రిగ్గా స‌రిపోయింద‌ని ఎంపిక చేసుకున్నామ‌ని తెలిపారు.