Begin typing your search above and press return to search.

ట్రైలర్ బాగుంది కానీ..

By:  Tupaki Desk   |   10 Nov 2018 5:30 PM GMT
ట్రైలర్ బాగుంది కానీ..
X
దక్షిణాది సినీ పరిశ్రమల్లో బాగా వెనుకబడిన ఇండస్ట్రీ అంటే శాండిల్ వుడ్డే. మన దగ్గర కొన్నేళ్ల కిందటే ఔట్ డేట్ అయిపోయిన సినిమాలు ఇప్పుడు అక్కడ తీస్తుంటారు. మిగతా దక్షిణాది సినీ పరిశ్రమల కంటే వాళ్లు ఒక పదేళ్లు వెనుక ఉంటారంటే అతిశయోక్తి ఏమీ కాదు. అన్ని సినిమాల్ని ఇలా ఒకే గాటన కట్టలేం కానీ.. స్టార్ హీరోలు చేసే సినిమాలు మాత్రం చాలా వరకు మన వాళ్లకు ఔట్ డేట్ అనే అనిపిస్తుంటాయి. ఎక్కువగా వేరే భాషల సినిమాల్ని రీమేక్ చేయడం.. అనుకరించడమే చేస్తుంటారు అక్కడి ఫిలిం మేకర్స్. తెలుగు.. తమిళ భాషల్లో మాదిరి భారీ ప్రయత్నాలు ఎప్పుడో కానీ జరగవు. ఐతే యువ కథానాయకుడు యశ్ హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా ‘కేజీఎఫ్’ను కన్నడ ఇండస్ట్రీ వాళ్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. దీన్ని తమ సినిమాగా గొప్పగా చెప్పుకుంటున్నారు.

యశ్ కు కర్ణాటక అవతల గుర్తింపేమీ లేకపోయినా సరే.. ఈ సినిమాపై చాలా ఆత్మవిశ్వాసంతో తెలుగు.. తమిళ భాషల్లోనూ తెరకెక్కించడం విశేషం. నిన్ననే దీని ట్రైలర్ ను మూడు భాషల్లోనూ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా చాలా భారీగానే తెరకెక్కిందని.. ఒక రేంజ్ మూవీ అని అనిపించే మాట వాస్తవం. కన్నడలో ఈ తరహా విజువల్స్ అరుదుగా కనిపిస్తుంటాయి. ఒక భారీ కథనే చెప్పే ప్రయత్నం జరిగినట్లుంది. ఛాప్టర్-1 అని వేయడం చూస్తే.. ఈ సిరీస్ లో ఇంకా ఒకట్రెండు సినిమాలు వచ్చేలా ఉన్నాయి. ఐతే భారీతనం.. పెద్ద కథ.. ఇవన్నీ ఓకే కానీ.. మనకైతే ఇలాంటి సినిమాలు కొత్తేమీ కాదు. అనాథలా పెరిగిన కుర్రాడు.. ఒక రౌడీ కావడం.. బడా బడా విలన్లను ఢీకొట్టడం.. ఒక సమూహానికి నాయకుడు కావడం.. ఇలాంటి కథలు గతంలో ఎన్నో చూశాం. ఇక విజువల్స్ పరంగా ఇంతకంటే భారీ సినిమాలు మన దగ్గర వచ్చాయి. మన దగ్గర వచ్చిన చాలా సినిమాల్ని ‘కేజీఎఫ్’ గుర్తుకు తెస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే.. డిసెంబరు 21న ఈ సినిమా రిలీజయ్యే రోజు ఇక్కడ ‘అంతరిక్షం’.. ‘పడి పడి లేచె మనసు’ లాంటి క్రేజీ చిత్రాలు రిలీజవుతున్నాయి. వాటి మధ్యన అస్సలు పరిచయం లేని యశ్ అనే హీరో సినిమాను మనోళ్లు చూస్తారా.. అసలు దీనికి ఇక్కడ థియేటర్లు దొరుకుతాయా అన్నది డౌటు.