కె.జి.ఎఫ్ ని నలిపేసారిలా

Tue Dec 18 2018 21:27:43 GMT+0530 (IST)

ఈ శుక్రవారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు రిలీజవుతున్నాయి. శర్వా నటించిన `పడి పడి లేచే మనసు` వరుణ్ తేజ్ నటించిన `అంతరిక్షం 9000కెఎంపిహెచ్` చిత్రాలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలుగా తెరకెక్కి అత్యంత క్రేజీగా రిలీజవుతున్నాయి. ఇక మిగిలినవి రెండూ డబ్బింగ్ సినిమాలు. ఒకటి కన్నడ హీరో యశ్ నటించిన కె.జి.ఎఫ్ - వేరొకటి ధనుష్ హీరోగా నటించిన `మారి 2`. ఇవన్నీ ఒకేరోజు అంటే డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా సుదీర్ఘంగా 9రోజుల సెలవుల్ని క్యాష్ చేసుకోవాలన్నదే ధ్యేయంగా ఒకేసారి నాలుగు సినిమాలు క్యూలోకొచ్చాయి.అయితే ఇన్ని సినిమాలకు థియేటర్లు సమకూర్చడం అంటే అంత వీజీనా?  కచ్ఛితంగా థియేటర్లను పంచుకోవాల్సి ఉంటుంది కదా?  థియేటర్లు ఎవరి గుప్పిట్లో ఉంటే వారి ఆధిపత్యం కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే `వినయ విధేయ రామా` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ఏషియన్ సునీల్ నారంగ్ .. `పడి పడి లేచే మనసు` చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తుండడంతో థియేటర్ల సమస్యేం లేదు. `పడి పడి లేచే మనసు` చిత్రాన్ని నైజాంలో సునీల్ నారంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం చిత్రాన్ని దిల్‌రాజు పంపిణీ చేస్తుండడంతో ఆ రెండు స్ట్రెయిట్ సినిమాలకు థియేటర్ల పరంగా చిక్కు లేదు.

నారంగ్ దిల్ రాజు ఇద్దరూ థియేటర్లను ఫుల్ గా లాక్ చేయడంతో కె.జి.ఎఫ్ చిత్రం మాత్రం థియేటర్ల గండంలో పడిందిట. సరైన ఏరియాల్లో సరైన థియేటర్లలో ఈ సినిమా పడే ఛాన్స్ లేదన్న మాటా వినిపిస్తోంది. ఒకేసారి థియేటర్ల షేరింగ్ కావడంతో కె.జి.ఎఫ్ ఆ రెండిటి మధ్యా పడి నలిగిపోతోందట. అలాగే వీళ్లకు తోడు ధనుష్ - సాయి పల్లవి నటించిన `మారి 2` చిత్రాన్ని 21న రిలీజ్ చేస్తుండడంతో వాళ్లు  కూడా సందట్లో సడేమియాగా థియేటర్లను సెట్ చేసుకునే పనిలో ఉన్నారట. ఇక స్ట్రెయిట్ రెండు సినిమాలపై భారీ అంచనాలున్న నేపథ్యంలో డబ్బింగ్ సినిమాల హవా ఏమేరకు సాగుతుందో చూడాలన్న టాక్ వినిపిస్తోంది. ఇక కె.జి.ఎఫ్ - మారి 2 రెండు సినిమాలకు సరైన ప్రమోషన్ లేకపోవడంతో వాటికి సంబంధించిన సందడే లేదు. అయితే కంటెంట్ బావుంటే పొరుగు సినిమా అయినా చూసే మంచి మనసు తెలుగు ప్రేక్షకులకు ఉంది. ఆ ఒక్కటే ఆ రెండు అనువాద చిత్రాలకు ఆశల్ని రేకెత్తిస్తోందని చెప్పొచ్చు. వీటికి మౌత్ టాక్ ఏమేరకు మేలు చేస్తుందో చూడాలి.