జ్యోతిక.. టూ వయొలెంట్

Sun Jan 14 2018 12:44:30 GMT+0530 (IST)

సూర్యను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు టాటా చెప్పేసినట్లే కనిపించింది జ్యోతిక. ఆరేడేళ్ల పాటు సినిమాల జోలికే వెళ్లలేదు. ఐతే రెండేళ్ల కిందట మళ్లీ మేకప్ వేసుకున్న జ్యోతిక.. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘36 వయదినిలే’.. ‘మగలిర్ మట్టుం’ లాంటి మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఐతే ఆ రెండు సినిమాల్లో ఫ్యామిలీ లేడీగా సాఫ్ట్ క్యారెక్టర్లు చేసిన జ్యోతిక.. ఇప్పుడు ‘నచియార్’ అనే సినిమాలో తన కెరీర్లో ఇప్పటిదాకా ఎన్నడూ చేయని రఫ్ క్యారెక్టర్లో కనిపించబోతోంది. రియలిస్టిగ్గా.. ‘రా’గా అనిపించే సినిమాలతో ప్రేక్షకులకు షాకిచ్చే బాలా దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నచియార్’. ఇందులో సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.ఇంతకుముందు ‘నచియార్’ టీజర్లో జ్యోతిక అవతారం.. ‘దొంగ నా కొడకా’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ చూసే జనాలకు వెర్రెత్తిపోయింది. ఇప్పుడు ట్రైలర్లో జ్యోతిక మరింత వయొలెంట్ గా కనిపించింది. క్రూరమైన పోలీసాఫీసర్ పాత్రలో జ్యోతిక లుక్.. ఆమె నటన.. యాటిట్యూడ్ అన్నీ కూడా సంచలనం రేపేలా ఉన్నాయి. నువ్వు పోలీసువా.. రౌడీవా అంటూ ఉన్నతాధికారి అడగడాన్ని బట్టి జ్యోతికది ఎలాంటి పాత్రో అర్థమవుతోంది. క్రిమినల్స్ పట్ల జ్యోతిక వ్యవహరించే తీరు షాకింగ్ గా ఉంది. ఒక రౌడీ విలవిలలాడుతున్నట్లు చూపించడం.. వెంటనే జ్యోతిక నోట్లో బ్లేడ్ కనిపించడాన్ని బట్టి బాలా ఆమె పాత్రను ఎలా చూపించాడో తెలుస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ పాత్ర కొంచెం ఫన్నీగా కనిపిస్తోంది. అతడి అవతారమూ షాకింగ్ గానే ఉంది. అతడికో లవ్ స్టోరీ పెట్టినట్లున్నారు. ఇదొక క్రైమ్ డ్రామా అనిపిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.