Begin typing your search above and press return to search.

జ్యో అచ్యుతానంద.. ఎంత హాయిగుందో..

By:  Tupaki Desk   |   24 Aug 2016 11:30 AM GMT
జ్యో అచ్యుతానంద.. ఎంత హాయిగుందో..
X
ఈ రోజుల్లో అచ్చమైన తెలుగు పాటలు రావడం.. సాహిత్యం వినిపించేలా బాణీలుండటం అన్నది అరుదైన విషయం. ఈ ట్రెండుకు సరిపడవని.. ప్రస్తుత సినిమాలకు సూటవ్వవని అలాంటి ప్రయత్నాలు చేయడం మానేస్తుంటారు చాలామంది. ఐతే ఈ తరహా పాటల్ని అభిమానించే.. ఆదరించే శ్రోతలకు కొదవేమీ ఉండదు. మంచి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆదరిస్తారు. అందుకు ‘జ్యో అచ్యుతానంద’ పాటలు నిదర్శనం. అల్లరి పాటలకు పేరుపడిన భాస్కరభట్ల.. ఎంతో టాలెంట్ ఉండి కూడా యావరేజ్ మ్యూజిక్ డైరెక్టర్‌ గా ముద్ర పడ్డ కళ్యాణ రమణ.. తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ చేసిన మంచి ఆల్బం ‘జ్యో అచ్యుతానంద’. వినడానికి చాలా హాయిగా అనిపిస్తాయీ పాటలు.

ఒక లాలన.. అంటూ కళ్యాణి రాగంలో శంకర్ మహదేవన్ పాడిన ఒక్క పాట చాలు.. ఈ ఆల్బం ప్రత్యేకతేంటో చెప్పడానికి. సాహిత్యం.. బాణీ.. గానం.. మూడూ కూడా అద్భుతంగా కుదిరాయి ఈ పాటకు. కొన్నేళ్ల పాటు నిలిచిపోయే పాట ఇది. భాస్కర భట్ల అంటే ఏదో అల్లరి పాటలే అనుకుంటాం కానీ.. ఆయనలో ఇంత లోతుందా అనిపిస్తుంది ఈ పాట. ఇదే పాటను ఫిమేల్ వాయిస్ తోనూ అందించాడు కళ్యాణ రమణ. హరిణిరావు కూడా చక్కగా పాడింది. ఆహాహా బాగున్నది.. అంటూ కార్తీక్ - రమ్య బెహరా పాడిన పాట... సువర్ణా...సువర్ణా అంటూ భాస్కరభట్ల రెగ్యులర్ స్టయిల్లో సాగే టీజింగ్ సాంగ్.. హృద్యంగా సాగిపోయే ‘జ్యో అచ్యుదానంద’ టైటిల్ సాంగ్.. అన్నీ కూడా వేటికవే ప్రత్యేకం అనిపిస్తాయి. మొత్తంగా మంచి సాహితీ విలువలు.. శ్రావ్యమైన సంగీతంతో అచ్చమైన తెలుగు పాటలు వినాలని.. అనుభూతి చెందాలని కోరుకుంటే ‘జ్యో అచ్యుతానంద’ మంచి ఛాయిస్.