టాలీవుడ్ లో వేషం కావాలంటే పడుకోవాలట

Mon Apr 16 2018 10:04:08 GMT+0530 (IST)

మరో సంచలనం. ఇంతకాలం గుట్టుగా సాగిపోతున్న దారుణాల్ని బట్టబయలు చేసేలా మహిళా ఆర్టిస్ట్ లు కొందరు బయటకు వచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దారుణాల్ని బట్టబయలు చేసే పనికి శ్రీకారం చుట్టారు. వేషం ఇవ్వాలంటే పడుకోవాల్సిందేనన్నట్లుగా పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. ఛాన్స్ కావాలంటే గడపాలని చెబుతున్నారని.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ అన్నది లేదన్నారు.రెడ్ లైట్ ఏరియా ముంబయిలోనే కాదు.. సాయంత్రం ఆరు అయ్యిందంటే ఫిలింనగర్ వీధుల్లోనూ కనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో నెగ్గాలంటే పడుకోవాలని.. లేదా పడుకోబెట్టాలని లేకుండా ఛాన్స్ లు వచ్చే అవకాశమే లేదంటూ జూనియర్ ఆర్టిస్ట్ లు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చెప్పుకొచ్చారు.

టాలీవుడ్ లో మహిళా ఆర్టిస్ట్ లను అంగడి సరుకుగా మార్చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్న ఉదంతాలపై గళం విప్పిన వారు.. తమపై జరుగుతున్న ఆరాచకాలపై సినీ పరిశ్రమలోని వారు ఎందుకు నోరు విప్పటం లేదో చెప్పాలన్నారు. రీల్ లైఫ్ లో హీరోలెవరూ.. రియల్ లైఫ్ లో హీరోలు కాదా? అని ప్రశ్నించిన వారు.. మహిళా సంఘాల నేతృత్వంలో తాజాగా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జూనియర్ ఆర్టిస్ట్ లు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమను వేధిస్తున్న వారికి సంబంధించిన సాక్ష్యాల్ని చూపించి మరీ పేర్లు బయటపెడతామని.. మరి అరెస్ట్ చేసే దమ్ముందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ ను కూడా వదల్లేదని.. అవకాశం కోసం వెళితే.. నువ్వు ట్రాన్స్ జెండర్ వేనా? అయితే.. బట్టలు విప్పి చూపించు అంటూ బట్టలు విప్పించారంటూ సోనా రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 పగలు అమ్మా అంటూ ఆత్మీయంగా పిలుస్తారని.. రాత్రి అయ్యేసరికి పక్కలో బొమ్మలా మారుస్తారంటూ మండిపడిన ఈ మీడియా సమావేశంలో నటీమణులు శ్రీరెడ్డి.. అపూర్వ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ సునీతారెడ్డి.. సంధ్యానాయుడు.. హేమలత  తదితరులు పాల్గొన్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. జూనియర్ ఆర్టిస్ట్ లు కొందరు చేసిన వ్యాఖ్యలు చూస్తే..

+ ఒక్క సినిమా పూర్తి అయ్యేనాటికి ఎందరో నలిగిపోతున్నారు. మాంసాన్ని అమ్మినట్లు మానాన్ని అమ్మేస్తున్నారు. అలా చేయకుంటే అవకాశాలు రావు. నా వరకు నేను ఎన్నోసార్లు అవకాశాల కోసం చెయ్యి చాపితే నాతో గడపమని అడిగారు. అలా గడిపా కూడా. అయినా అవకాశాలు ఇవ్వలేదు. చివరకు ఎవరి పేర్లు బయటికి రాకుండా ఎవరి బట్టలు విప్పకుండా ఆవేదనతో నా బట్టలు నేనే విప్పుకున్నా. ఇలా సినిమా ఇండస్ట్రీలో మోసపోతున్న అమ్మాయిలెందరో ఉన్నారు. ఎందరినో వాడుకున్న వాకాడ అప్పారావును ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకంటే తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం సినిమా పెద్దల్లో ఉంది. - శ్రీరెడ్డి - నటి

+ ఛాన్స్ కావాలంటే పడుకోవాలంటున్నారు. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక నరకయాతన అనుభవిస్తున్నాం. సినిమా కంపెనీ వారు రూ.3500-4000 ఇస్తే మధ్యలో కోఆర్డినేటర్స్ ఆ డబ్బు తీసుకొని రూ.1500 మాత్రమే ఇస్తున్నారు. మమ్మల్ని జలగల్లా పీడిస్తున్నారు. - సునీతారెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్

+ ఆడపిల్ల సమస్యతో రోడ్డు ఎక్కితే కనీసం మీ సమస్య ఏమిటని అడిగే నాథుడే లేడు. పిల్లలు కుటుంబాన్ని బతికించుకోవడానికి కష్టపడుతుంటే రకరకాల మాటలతో తూట్లు పొడుస్తున్నారు. తాత వయసున్న వారు కూడా తమతో గడపాలంటారు   – అపూర్వ - నటి

+ శ్రీరెడ్డికి మద్దతుగా వెళ్తుంటే సినిమా ఛాన్స్ లు ఇవ్వమని బెదిరిస్తున్నారు. ఆమెతో తిరగొద్దంటున్నారు. అలా చేస్తే కెరీర్ పోతుందని హెచ్చరిస్తున్నారు. - హేమ - ఆర్టిస్ట్

+ అమ్మాయిలనే కాదు ఆంటీలు.. 80 ఏళ్ల ముసలి వాళ్లను సైతం లైంగికంగా వేధిస్తారు. మా బాధల్ని ఇంట్లో వారికి చెప్పుకోలేం - సంధ్యానాయుడు

+ ఇండస్ట్రీలో మృగాళ్లు పీక్కు తింటున్నారు. తెర మీద సందేశాలు ఇవ్వటమే కానీ తెర వెనుక మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారు - నాగలక్ష్మి

+ పవన్ కల్యాణ్.. శేఖర్ కమ్ముల.. కత్తి మహేష్‌లు లీగల్ గా ముందుకు వెళ్లాలంటున్నారు. అలా చెప్పటం మా గొంతు నొక్కేయటమే - తేజస్విని

+ సినిమా ఇండస్ట్రీలో బతకటమే కష్టంగా ఉంది. ఆడాళ్లుగా పుట్టటమే నేరమా? - జాన్సీ - నటి