Begin typing your search above and press return to search.

సింగిల్ టేక్ హీరోతో 40 టేకులు

By:  Tupaki Desk   |   22 May 2017 5:10 AM GMT
సింగిల్ టేక్ హీరోతో 40 టేకులు
X
రీసెంట్ గా 'దర్శకుడు' మూవీ టీజర్ లాంఛింగ్ ఈవెంట్ జరిగింది. సుకుమార్ రైటింగ్స్ రూపొందిన ఈ చిత్రం టీజర్ లాంఛింగ్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా చేయించారు. సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన మొదటి సినిమా కుమారి 21ఎఫ్ కూడా ఎన్టీఆర్ తోనే మొదలుపెట్టారు. తన ట్విట్టర్ లో కూడా కుమారికి ప్రచారం చేశాడు ఎన్టీఆర్.

దర్శకుడు టీజర్ లాంఛింగ్ ఈవెంట్ లో సుకుమార్ గురించి చాలానే చెప్పాడు జూనియర్. వీరిద్దరి కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో చిత్రం రూపొంది.. భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కు తొలి 50 కోట్ల షేర్ ను సాధించిన సినిమా ఇది. అయితే.. ఆ సినిమా షూటింగ్ సమయంలో సుకుమార్ తనతో ఎంతగా వర్క్ చేయించుకున్నాడో చెప్పాడు యంగ్ టైగర్. అప్పటి షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్న జూనియర్.. 'ఒక సీన్ కోసం అయితే విపరీతంగా తపన పడ్డాడు. ఒక్క సీన్ కోసం నాతో 40 సార్లు రీటేక్ చేయించాడు. సినిమాపై సుకుమార్ ప్యాషన్ ఆ స్థాయిలో ఉంటుంది' అని చెప్పాడు ఎన్టీఆర్.

రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజున 'ఓన్లీ సింగిల్ టేక్ హీరో' అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్.. యంగ్ టైగర్ కు ట్యాగ్ ఇచ్చి పొగిడాడు. ఎలాంటి సీన్ అయినా ఒకే టేక్ లో కంప్లీట్ చేయడం ఎన్టీఆర్ స్పెషాలిటీ. అలాంటి ఎన్టీఆర్ తోనే ఒక సీన్ కోసం 40 టేకులు తినిపించి చేయించాడంటే.. నాన్నకు ప్రేమతో చిత్రం కోసం సుకుమార్ ఏ స్థాయిలో మూవీ కోసం కష్టపడ్డాడో.. కష్టపెట్టాడో అర్ధమవుతుంది.