అక్కడకు తారక్ ఎంట్రీ ఇచ్చాడు

Thu Jun 14 2018 09:59:01 GMT+0530 (IST)


టాలీవుడ్ లో స్టార్ హీరోలందరికీ ఫ్యాన్స్ ఎక్కువే. సినిమా హిట్టు - ఫ్లాపులతో సంబంధం లేకుండా హీరోలను ఆరాధించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. తమ హీరోకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. హీరోలేమో అడపాదడపా తప్ప మీడియా ముందుకు రారు. అందుకని ఫ్యాన్స్ తో రెగ్యులర్ టచ్ లో ఉండటానికి మంచి వేదిక సోషల్ మీడియా.మన హీరోల్లో చాలామంది సోషల్ మీడియాను లిమిటెడ్ గా వాడుతుంటారు. కొందరు హీరోలైతే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇంతవరకు సోషల్ మీడియాలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఆ లోటును తీరుస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఎంటరయిపోయాడు. ఫస్ట్ పోస్టు కూడా పెట్టాడు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీరరాఘవ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులకు షేర్ చేశాడు. తారక్ సోషల్ మీడియాలో ఎంట్రీతో అతడి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈమూవీ తెరకెక్కుతోంది. రంగస్థలం మూవీలో ఐటం సాంగ్ తో అందరితో స్టెప్పులేయించిన పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. దసరాకు అరవింద సమేత వీరరాఘవ థియేటర్లకు రానుంది.