Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: కోర్టులో కలుద్దాం

By:  Tupaki Desk   |   24 Jan 2017 8:15 AM GMT
ట్రైలర్ టాక్: కోర్టులో కలుద్దాం
X
కెరీర్ ఆరంభంలో రొటీన్ యాక్షన్ సినిమాలు చేసిన అక్షయ్ ఆ తర్వాత కామెడీ సినిమాల బాట పట్టాడు. ఆపై మాంచి కంటెంట్ ఉన్న.. అద్భుతమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. గత ఏడాది అక్షయ్ నటించిన ‘రుస్తుమ్’ సూపర్ హిట్టయింది. ఇప్పుడు అక్షయ్ నుంచి రాబోతున్న ‘జాలీ ఎల్ ఎల్ బీ-2’ కూడా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో భలే ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇండియా జనాభా 125 కోట్లయితే మనకు కోర్టుల్లో అందుబాటులో ఉన్న జడ్జీలు కేవలం 21 వేల మంది మాత్రమే అని.. మన కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం కేసులు 3.5 కోట్లని.. అయినప్పటికీ ఇద్దరి మధ్య ఏదైనా తగాదా వస్తే కోర్టులో కలుద్దాం అంటూ సవాలు విసురుకుంటారని అక్షయ్ కుమార్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది ఈ ట్రైలర్. అక్షయ్ ఇందులో నిజాయితీ పరుడైన లాయర్ పాత్రను పోషిస్తున్నాడు. ‘విక్కీ డోనర్’లో డాక్టర్ పాత్రతో జాతీయ అవార్డు అందుకున్న అన్ను కపూర్ ఇందులో లంచం తీసుకుని ఓ నిందితుడి తరఫున వాదించడానికి సిద్ధపడే లాయర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయనకు అక్షయ్ కు మధ్య కోర్టు వేదికగా జరిగే పోరాటమే ఈ సినిమా. లాయర్ పాత్రలో అక్షయ్ ఇందులో విశ్వరూపమే చూపించినట్లున్నాడు. అతడి నటన.. డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యేలా ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేలా ఉంది. ఫిబ్రవరి 10న కోర్టులో కలుద్దాం అంటూ ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ట్రైలర్లోనే ప్రకటించారు. 2013లో ‘జాలీ ఎల్ ఎల్ బీ’తో సూపర్ హిట్ కొట్టిన సుభాష్ కపూరే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/