మార్చి 31 తర్వాత.. రికార్డులు ఎలా?

Fri Mar 17 2017 20:45:28 GMT+0530 (IST)

కొన్ని నెలల కిందటి వరకు ఒక తెలుగు ట్రైలర్ 20-30 లక్షల వ్యూస్ తెచ్చుకుంటేనే ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల టీజర్లు.. ట్రైలర్లు రిలీజైతే కొన్ని గంటల్లోనే మిలియన్ మార్కును టచ్ చేసేస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150.. కాటమరాయుడు.. దువ్వాడ జగన్నాథం టీజర్లు ఎలా మోత మోగించాయో చూశాం. ‘ఖైదీ నెంబర్ 150’లోని ఒక పాటను లిరికల్ వీడియోతో రిలీజ్ చేస్తే 2 కోట్ల వ్యూస్ తెచ్చుకుంది. ఇక తాజాగా ‘బాహుబలిః ది కంక్లూజన్’ ట్రైలర్ ప్రకంపనల గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. కనీ వినీ ఎరుగని స్థాయిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.

మరి ఇదంతా ఎలా సాధ్యం..? వ్యూస్ ఒక్కసారిగా ఇలా ఎలా పెరిగిపోయాయి.. అంటే కారణం జియోనే. రోజూ ఉచితంగా 1 జీబీ ఇంటర్నెట్ వాడుకునే అవకాశం కల్పించడంతో జనాలు యూట్యూబ్ లో ను ఫుల్లుగా వాడేస్తున్నారు. అక్కడ ఏం కనిపించినా ఒక లుక్ వేసేస్తున్నారు. కోట్లాది మంది చేతికి కొత్తగా 24 గంటల ఇంటర్నెట్ వచ్చింది. దీంతో టీజర్లు.. ట్రైలర్లు.. ఇంకా అన్ని రకాల వీడియోలకూ వ్యూస్ మోత మోగుతోంది.ఐతే మార్చి 31తో జియో ఫ్రీ ఇంటర్నెట్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత ఈ మోత ఉండకపోవచ్చు. రికార్డుల జోరుకు కళ్లెం పడవచ్చు.

అప్పుడొచ్చే టీజర్లు.. ట్రైలర్లు ఎన్ని వ్యూస్ తెచ్చుకుంటాయో చూడాలి. ఈ ఫ్రీ ఇంటర్నెట్ టైంలో టీజర్లు.. ట్రైలర్లు రిలీజ్ చేసుకున్న వాళ్లు అదృష్టవంతులు. జియో అడ్వాంటేజీని తమ హీరో వాడుకోలేదని మహేష్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ కొత్త సినిమా టీజర్ ఎప్పుడో వస్తుందన్నారు. కానీ ఇప్పటిదాకా రాలేదు. మార్చి 31లోపు రాకుంటే జియో అడ్వాంటేజీ దానికి ఉండదు. మహేష్ అభిమానులకనే కాదు.. మిగతా వాళ్లకూ మార్చి 31 తర్వాత కష్టమే. జియో ఫ్రీ ఇంటర్నెట్ డెడ్ లైన్ ముగిసిపోవడం ఇండస్ట్రీలో అందరికీ చేదు వార్తే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/