Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు జవాన్ రిలీజ్ డేటిచ్చారు

By:  Tupaki Desk   |   21 Oct 2017 11:55 AM GMT
ఎట్టకేలకు జవాన్ రిలీజ్ డేటిచ్చారు
X
ఆగస్టు 11కే రిలీజ్ కావాల్సిన సినిమా ‘జవాన్’. ఐతే ఆ తేదీకి పోటీ ఎక్కువ ఉందని.. సెప్టెంబరు 1కి వాయిదా వేశారు. కానీ అదే తేదీకి బాలయ్య సినిమా ‘పైసా వసూల్’ షెడ్యూల్ కావడంతో దీన్ని వాయిదా వేశారు. ఇక అంతే... ఆ తర్వాత అతీ గతీ లేదు. నెలలు నెలలు గడిచిపోతున్నా ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి ఊసే లేదు. మధ్యలో నవంబరు 3 అంటూ ఓ కబురు వినిపించింది కానీ.. ఆ తర్వాత ఆ డేటునీ వదిలేశారు. ఈ సినిమా ఎందుకింత ఆలస్యమవుతోందో ఎవ్వరికీ అర్థం కాలేదు. చిత్ర సమర్పకుడు దిల్ రాజుకు ఔట్ పుట్ విషయంలో అసంతృప్తి ఉండటంతో రీషూట్లు చేయిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అలా చూసుకున్నా సినిమా ఈపాటికి రెడీ అయిపోయి ఉండాలి.

ఎంతకూ ఈ సినిమా రిలీజ్ డేట్ రాకపోవడంతో సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు. ఐతే ఎట్టకేలకు వాళ్లు కోరుకున్న కబురు వచ్చేసింది. డిసెంబరు 1న ‘జవాన్’ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇంకా సినిమాకు కొన్ని టచప్స్ చేయాల్సి ఉండటంతో హడావుడి లేకుండా లేటుగా డేట్ చూసుకున్నారు. నవంబరులో పెద్ద సినిమాలేవీ లేకపోయినా ఆ నెలలో రిలీజ్ చేయాలనుకోలేదు. ఇంతకుముందు ‘వాంటెడ్’ అనే ఫ్లాప్ సినిమా తీసిన రైటర్ టర్న్డ్ డైరెక్టర్ బి.వి.ఎస్.రవి ఈ చిత్రాన్ని రూపొందించాడు. అతడికీ సినిమా చాలా కీలకం. వరుసగా మూడు ఫ్లాపులు తిన్న సాయిధరమ్ కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యమే. ఈ చిత్రంలో తేజు సరసన మెహ్రీన్ కథానాయికగా నటించింది.