Begin typing your search above and press return to search.

కొరటాలా.. వినాయక్ పూనాడా ఏంటి?

By:  Tupaki Desk   |   28 Aug 2016 1:30 PM GMT
కొరటాలా.. వినాయక్ పూనాడా ఏంటి?
X
ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘అల్లుడు శీను’ అనే సినిమా చేశాడు వి.వి.వినాయక్. కొత్త హీరో అయినా ఏమాత్రం రాజీ పడలేదు. ఎంత డబ్బులు పోయడానికి బెల్లంకొండ సురేష్ ఉండటంతో ప్రతి పాటలోనూ సెట్టింగులతో మోత పుట్టించేశాడు. ఒక పాటకు ఒక సెట్టింగుతో సరిపెట్టకుండా రెండు మూడు వేయించాడు. దీంతో బడ్జెట్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమా అనే కాదు.. తన ప్రతి సినిమాలోనూ పాటలకు భారీ లెవెల్లో సెట్టింగ్స్ వేయిస్తుంటాడు వినాయక్. అందుకే ఇండస్ట్రీలో ఆయన్ని ‘సెట్టింగ్ కింగ్’ అంటుంటారు. ఇలా మరే దర్శకుడూ పాటల కోసం ఇంతగా సెట్టింగ్స్ మీద ఆధార పడడు. ఐతే ‘జనతా గ్యారేజ్’లో ఓ పాట చూస్తుంటే మాత్రం కొరటాలను వినాయక్ పూనాడేమో అనిపిస్తోంది.

సినిమా విడుదలకు రోజులు దగ్గర పడుతుండటంతో ఒక్కో పాట ప్రోమోతో యాడ్స్ కుమ్మేస్తోంది గ్యారేజ్ టీం. ఇందులో భాగంగా తాజాగా ‘దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ..’ అనే పాట ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో భారీ సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి. కనీసం నాలుగు రకాల సెట్టింగ్స్ లో ఈ పాట తీసినట్లుగా కనిపిస్తోంది. బుల్లితెరమీద చూస్తుంటే కళ్లు జిగేల్మంటున్నాయి. మరి వెండి తెర మీద ఎలా ఉంటుందో చూడాలి. ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్పులు ఓ రేంజిలో వేశాడని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. కాజల్ స్టెప్పులేసిన ఐటెం పాట ‘పక్కా లోకల్’ మినహాయిస్తే మిగతా అన్ని పాటల ప్రోమోలతో టీవీల్లో హోరెత్తించేస్తోంది ‘గ్యారేజ్’ టీమ్. అన్నీ కూడా ఆసక్తికరంగానే అనిపిస్తున్నాయి.