Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: జక్కన్న

By:  Tupaki Desk   |   29 July 2016 11:36 AM GMT
మూవీ రివ్యూ: జక్కన్న
X
చిత్రం: ‘జక్కన్న’

నటీనటులు: సునీల్ - మన్నారా - కబీర్ సింగ్ - సత్యప్రకాష్ - నాగినీడు - సప్తగిరి - పృథ్వీ - పోసాని కృష్ణమురళి - చిత్రం శీను - రఘు కారుమంచి - ఆశిష్ విద్యార్థి తదితరులు
సంగీతం: దినేష్
ఛాయాగ్రహణం: రామ్ ప్రసాద్
మాటలు: భవానీ ప్రసాద్
నిర్మాత: సుదర్శన్ రెడ్డి
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల

హీరోగా వరుస ఫెయిల్యూర్లతో సతమతమవుతూ.. ఈసారి హిట్టు కొట్టి తీరాల్సిన పరిస్థితుల్లో సునీల్ ‘జక్కన్న’ అవతారమెత్తాడు. ‘రక్ష’తో దర్శకుడిగా పరిచయమైన వంశీకృష్ణ ఆకెళ్ల రూపొందించిన సినిమా ఇది. ‘బ్యాక్ టు ఎంటర్టైన్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకుని వచ్చిన సునీల్.. ఈసారైనా జనాల్ని అలరించాడా.. సక్సెస్ ట్రాక్ ఎక్కేలా ఉన్నాడా.. చూద్దాం పదండి.

కథ:

గణేష్ (సునీల్) ఎవరైనా తనకు సాయం చేస్తే.. ఆ సాయాన్ని ఎప్పటికీ మరిచిపోకుండా.. తనకు సాయపడ్డ వాళ్లను వెంటాడి మరీ రుణం తీర్చుకునే రకం. అతను తన ముఖం చూపించకుండానే హత్యలు చేస్తూ జనాల్ని గడగడలాడించే బైరాగి (కబీర్ సింగ్) కోసం వైజాగ్ వస్తాడు. అక్కడ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఓవైపు ఆ అమ్మాయిని ప్రేమలో దించడానికి ప్రయత్నాలు చేస్తూనే.. బైరాగి కోసం వెతుకులాట కొనసాగిస్తాడు గణేష్. చివరికి బైరాగి ఎక్కడున్నాడో తెలుసుకుని అతడికి దగ్గరికి వెళ్తాడు గణేష్. ఇంతకీ బైరాగి కోసం గణేష్ ఎందుకు వెతుకుతుంటాడు.. అతడికి ఇతడికి సంబంధమేంటి.. బైరాగిని కలిశాక గణేష్ ఏం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘‘లోపల జరిగేది ఓటింగ్ కాదు.. ఫైటింగ్’’.. ‘‘ఆమె నాకు ఏ సాయం చేయకున్నా.. నేను మాత్రం ఆమెతో వ్యవసాయం చేసేస్తా’’.. ‘‘నేనేమైనా కోడిని అనుకున్నావా.. రౌడీని’.. ‘‘వీడు పగలు పంచర్స్ వేస్తుంటాడు.. రాత్రి వెంచర్స్ వేస్తాడు’’.. ‘‘ఇది రుణం కాదు.. దారుణం’’.. ‘‘నాకు సెన్సే కాదు.. లైసెన్స్ కూడా ఉంది’’.. ‘‘ఈ దెబ్బతో ఆ మాస్టర్ లైఫ్ వరస్ట్ అయిపోతుంది.. నా డార్లింగ్ నాతో అరెస్టయిపోతుంది’’.. ‘‘ఆ పూబంతిని వదిలేస్తే.. నీకు వాడేసిన బంతే మిగులుతుంది’’.. ‘‘మందేస్తే మత్తొస్తుందంటారు.. కానీ నీకు గుర్తొస్తుందా’’..!

‘జక్కన్న’ సినిమాలో పదుల సంఖ్యలో వచ్చే ప్రాస డైలాగుల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఆ సందర్భానికి ఆ ప్రాస సెట్టవుతుందా అన్నది సంబంధం లేదు.. ప్రతి సన్నివేశంలోనూ ప్రాస కోసం పాకులాటే.. ద్వితీయార్ధంలో ఓ సన్నివేశంలో హీరో ‘‘ఇరిటేషన్.. ఫ్రస్టేషన్’’ అంటూ ఇలాంటి ప్రాసతో కూడిన పంచ్ డైలాగు ఒకటి పేలుస్తాడు. బహుశా ఆ సమయానికి ప్రేక్షకుల మూడ్ అలాగే ఉంటుందని గెస్ చేసి మరీ ఆ డైలాగ్ పెట్టారో ఏంటో తెలియదు.

సీన్లోకి కొత్త పాత్ర ఎంటరైతే.. మామూలుగా ‘ఎవరు’ అంటారు. కానీ ‘జక్కన్న’లో మాత్రం ఎదురుగా మనిషి కనిపిస్తే చాలు.. ‘‘లడ్డుకి లంగావోణికి కట్టినట్లుందిరా’’.. ‘‘వీడెవడు కింగ్ కాంగ్ సినిమాకు ట్రైలర్లా ఉన్నాడు’’.. ‘‘విధ్వంసకుల్లా ఉన్నారు.. వీళ్లు విధ్వాంసులేంటి’’.. ‘‘టీ మాస్టర్లా ఉన్నాడు వీడు కుంగ్ ఫూ మాస్టరేంటి’’.. ప్రాసలతో పోలికలు పెడుతూ ప్రతి పాత్రా రన్నింగ్ కామెంట్రీ ఇచ్చేస్తూ ఉంటుంది. తెలుగులో ప్రాసలు పంచులకు కాలం చెల్లి చాలా కాలమైపోయింది. ఇలాంటి తరుణంలో సినిమా అంతా ఇలాంటి డైలాగుల్నే నింపుకుని వచ్చింది ‘జక్కన్న’.

ఈ డైలాగుల సంగతి వదిలేసి కథాకథనాల సంగతి చూస్తే.. వాటిలోనూ చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ప్రథమార్ధంలో హీరో చాలా కసిగా విలన్ని వెతకడం చూస్తే ఇతడికేదో భారీ ఫ్లాష్ బ్యాక్ ఉందని.. విలన్ తో జన్మ జన్మల పగ ఉందని భ్రమల్లో పడతాం. కానీ బుడ్డోడిగా ఉన్నపుడు తనను చంపబోయిన రౌడీని అతను చంపాడని.. అతణ్నేదో ఉద్దరిద్దామనే మిషన్ మీద ఇతను వచ్చాడని తెలిశాక గాలి తీసేసినట్లవుతుంది. కనీసం రొటీన్ గా రివెంజ్ స్టోరీలాగా నడిపించేసినా పోయేదేమో. కానీ విలన్ని ఉద్దరించడానికే హీరో రావడం.. అతణ్ని బకరాని చేసి ఆడుకోవడం.. అంతా చాలా గందరగోళంగా అనిపిస్తుంది. చివరిదాకా హీరో అలా ప్రవర్తించడానికి ఇంకేమైనా కారణం ఉంటుందేమో అని ఎదురు చూస్తే నిరాశ తప్పదు.

ఇంటర్వెల్ దగ్గరే ఈ కథతో ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయిపోతాడు. ఇక అక్కడి నుంచి కామెడీ ఛానెల్లో వరుసబెట్టి కామెడీ సీన్లు వస్తే చూస్తున్నట్లుగా ఉంటుంది. కథ గురించి.. లాజిక్కుల గురించి పట్టించుకోకుండా చూస్తే కొన్ని కామెడీ సీన్లను ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే మాత్రం ‘జక్కన్న’తో కలిసి చివరిదాకా ప్రయాణం చేయడం కష్టం. డమ్మీ కుంగ్ ఫూ మాస్టర్ పాత్రలో.. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’ స్ఫూర్తితో తీసిన మతిమరుపు ఎపిసోడ్ లో సప్తగిరి కొంత వరకు నవ్వించాడు. పృథ్వీ తనకు అలవాటైన రీతిలో బాలయ్య డైలాగుల పేరడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. మాస్ ఆడియన్స్ కు ఈ కామెడీ కొంత వరకు ఎక్కొచ్చు. ఐతే ముందే అన్నట్లు కథాకథనాల సంగతి వదిలేస్తేనే ఈ కామెడీని కూడా ఎంజాయ్ చేయగలం.

కామెడీ సీన్లు.. ప్రాసలతో కూడిన పంచ్ డైలాగులు.. రెండు మూడు ఫైట్లు కాకుండా సినిమాలో ఆరు పాటలు కూడా ఉన్నాయి. ముందు హీరో ఇంట్రడక్షన్ సాంగ్.. ఆ తర్వాత హీరోయిన్ కూడా తోడవుతుంది. పాట రావాల్సిన టైం అయితే బెల్లు కొట్టినట్లు హీరోయిన్ ఠంచనుగా వచ్చి హీరో ముందు వాలిపోతుంది. ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ సీన్. వెంటనే ఓ డ్రీం సాంగ్.. ఇలా సాగుతుంది వ్యవహారం. అసలీ సినిమాకు ‘జక్కన్న’ అనే పేరెందుకు పెట్టారని సినిమా చూస్తున్నంతసేపూ డౌట్ కొడుతూ ఉంటుంది. చివరికి ఉత్కంఠకు తెరదించుతూ రాయిలా ఉన్న విలన్ని శిల్పంలా మలిచిన జక్కన్న ఇతను అంటూ టైటిల్ జస్టిఫికేషన్ కోసం ఓ డైలాగ్ పెట్టారు. అదీ సంగతి.

నటీనటులు:

సునీల్ గురించి ఏం చెప్పాలి.. అటు కామెడీకి.. ఇటు హీరోయిజానికి.. రెంటికీ చెడ్డవాడైపోతున్నందుకు బాధపడాలి తప్ప. తన బాడీని.. బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకోవడం వల్ల ఒకప్పట్లా అతను కామెడీ చేస్తే నవ్వు రావట్లేదు. పోనీ హీరోయిజమైనా పండుతోందా అంటే అదీ జరగట్లేదు. తన వరకు పడ్డ కష్టమైతే తెరమీద కనిపిస్తుంది. డ్యాన్సులు బాగా చేశాడు. హీరోయిన్ మన్నారా గురించి చెప్పడానికేమీ లేదు. అందం.. అభినయం రెండింట్లోనూ మైనస్ మార్కులే పడతాయి. కబీర్ సింగ్ ను చూస్తే ‘జిల్’ సినిమాలో భయపెట్టిన విలన్ ఇతనేనా అనిపిస్తుంది. అంత డమ్మీ క్యారెక్టర్ చేశాడిందులో. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

టెక్నీషియన్స్ ఏదో ప్రత్యేకంగా చేయాల్సినంత అవసరం స్క్రిప్టులో లేదు. దినేష్ ఒక మాస్ సినిమాకు సరిపోయే పాటలిచ్చాడు. సునీల్ డ్యాన్సులేసుకోవడానికి ఆ పాటలు బాగానే పనికొచ్చాయి. నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తుంది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణంలో కూడా ప్రత్యేకత ఏమీ కనిపించదు. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. సునీల్ మార్కెట్ స్థాయికి మించి బాగానే ఖర్చు పెట్టారు. వర్మ తీసిన ‘ఫూంక్’ను ‘రక్ష’గా తెలుగులోకి మక్కీకి మక్కీ దించిన దర్శకుడు వంశీకృష్ణ.. ఈసారి ఫక్తు కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకోవాలనే తాపత్రయంలో లాజిక్ లేని కథాకథనాలతో వచ్చాడు. అతడి స్క్రిప్టులో ఒరిజినాలిటీ కరువైంది. దర్శకుడిగా వంశీకృష్ణ ఏమాత్రం మెప్పించలేదు.

చివరగా: జక్కన్నా.. ఇదేం శిల్పం అన్నా?

రేటింగ్: 2/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre