‘జనతా గ్యారేజ్’ వెనక్కి..‘జై లవకుశ’ ముందుకు..

Fri Sep 22 2017 13:13:18 GMT+0530 (IST)

యుఎస్ తెలుగు ఆడియన్స్ క్లాస్ ఎంటర్టైనర్లంటేనే ఎక్కువ ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. అలాంటి సినిమాలకే అక్కడే వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్ సినిమాల్లో క్లాస్ టచ్ ఉన్న ‘నాన్నకు ప్రేమతో’.. ‘జనతా గ్యారేజ్’ సినిమాలు అక్కడ భారీ వసూల్లు సాధించాయి. ఒకటి 2 మిలియన్ మార్కు దాటితే.. ఇంకోటి 1.8 మిలియన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి వచ్చిన ‘జై లవకుశ’ మాస్ మసాలా సినిమా కావడంతో అమెరికాలో దీనికి ఏమాత్రం వసూళ్లు ఉంటాయో అని సందేహించారు. కానీ ఆ సందేహాల్ని పటాపంచలు చేస్తూ ఈ చిత్రం యుఎస్ లో అదరగొట్టేసింది. ప్రిమియర్లతోనే హాఫ్ మిలియన్ మార్కు దాటేసింది. ‘జనతా గ్యారేజ్’ అక్కడ 5.87 లక్షల డాలర్లతో ఎన్టీఆర్ సినిమాల్లో ప్రిమియర్ల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టిస్తే.. దాన్ని ‘జై లవకుశ’ దాటేసింది. ఈ చిత్రం అక్కడ బుధవారం 5.89 లక్షల డాలర్లు వసూలు చేసింది.గురువారం వసూళ్లు కూడా కలుపుకుంటే ‘జై లవకుశ’ వసూళ్లు 9 లక్షల డాలర్ల దాకా ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంటే రెండో రోజుకే ఈ చిత్రం మిలియన్ క్లబ్బులోకి చేరబోతోందన్నమాట. సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో శని.. ఆదివారాల్లోనూ వసూళ్లు భారీగా ఉంటాయి కాబట్టి ‘జనతా గ్యారేజ్’ ఫుల్ రన్ వసూళ్లను తొలి వారాంతంలోనే ‘జై లవకుశ’ దాటేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఫుల్ రన్లో ‘నాన్నకు ప్రేమతో’ వసూళ్లను కూడా దాటడం ఖాయమే. ఈ చిత్ర యుఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని రూ.8.5 కోట్లకు అమ్మారు. 1.6 మిలియన్ డాలర్ల మార్కును దాటితే డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లోకి వస్తాడు. దీన్ని బట్టి చూస్తే బయ్యర్ లాభాల బాట పట్టడం ఖాయమనే చెప్పాలి.