ఒంటి చేత్తో 130 కోట్లు

Wed Oct 11 2017 15:49:11 GMT+0530 (IST)

కంటెంట్ పరంగా చూస్తే ‘జై లవకుశ’ గొప్ప సినిమా ఏమీ కాదు. పాత కథతో.. చాలా మామూలు కథనంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు బాబీ. కంటెంట్ విషయంలో చాలా విమర్శలు కూడా వచ్చాయి ఈ సినిమాకు సంబంధించి. ఇక హీరోయిన్ల ఆకర్షణా పెద్దగా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్.. విజువల్స్ కూడా ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా యావరేజే. సినిమాల కమెడియన్ల పాత్ర కూడా తక్కువే. ఇంతకీ ఏముందీ సినిమాలో అంటే.. మూడు పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ నటనా కౌశలమే. ఈ సినిమాకు సంబంధించి జనాల్ని ఎగ్జైట్ చేసిన ప్రధాన అంశాలు.. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం.. జై పాత్రలో అతడి పెర్ఫామెన్స్.‘జై లవకుశ’ విడుదలకు ముందు.. తర్వాత చర్చలన్నీ ఎన్టీఆర్ చుట్టూనే తిరిగాయి. ఈ సినిమాకు ప్రధాన బలం.. ఆకర్షణ ఎన్టీఆరే. కాబట్టి ఈ సినిమా సాధించిన ఫలితం తాలూకు క్రెడిట్ ప్రధానంగా అతడికే ఇవ్వాలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ రన్లో రూ.80 కోట్ల దాకా షేర్.. రూ.130 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తోంది. థియేట్రికల్ హక్కుల్ని రూ.86 కోట్లకు అమ్మగా ఎలాగోలా కష్టపడి బ్రేక్ ఈవెన్ కు దగ్గరగానే వచ్చేసిందీ చిత్రం. బయ్యర్లకు నష్టాలొచ్చినా అవి స్వల్పంగానే ఉంటాయి. యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాతో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. అది ఎన్టీఆర్ వల్లే సాధ్యమైంది. అతడి ఇమేజ్.. మార్కెట్ ఎంత పెరిగిందో చెప్పడానికి ‘జై లవకుశ’ ఒక రుజువనడంలో సందేహం లేదు.