ఫస్ట్ లుక్: సంకెళ్లతో రాయల్ ఎన్టీఆర్

Fri May 19 2017 15:36:58 GMT+0530 (IST)

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జై లవకుశ’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ అయిపోయింది. అభిమానుల ఆనందాన్ని ‘రెట్టింపు’ చేస్తూ ఒకటికి రెండు పోస్టర్లు లాంచ్ చేశాడు నిర్మాత కళ్యాణ్ రామ్. మెలితిప్పిన మీసం.. గడ్డం.. మారిన హేర్ స్టైల్.. పెద్ద మనుషులు పెట్టే కళ్లజోడు.. నల్లటి చొక్కా.. మొత్తంగా ఎన్టీఆర్ లుక్ రాయల్ గా.. కొత్తగా అనిపిస్తోంది.

ఒక పోస్టర్లో కారు డోరు తీసుకుని దిగుతూ.. మరో పోస్టర్లో చేతికి సంకెళ్లతో అభివాదం చేస్తూ.. దర్శనమిచ్చాడు తారక్. బ్యాగ్రౌండ్లో రావణాసురుడి అవతారం దర్శనమిస్తోంది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉన్నాయి రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు. పక్కా మాస్ లుక్ కనిపిస్తోంది వీటిలో. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు చెబుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ లీక్ అయిన ఆన్ లొకేషన్ పోస్టర్లో ఎన్టీఆర్ లుక్ మామూలుగానే ఉంది. దాంతో పోలిస్తే ఇప్పుడు రిలీజ్ చేసిన లుక్ డిఫరెంటుగా ఉంది. సినిమాలో చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటున్న నెగెటివ్ రోల్ లుక్ ఇదేనా.. ఇంకోటా అన్నది క్లారిటీ లేదు. శనివారం ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ముందు రోజే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమా 50 శాతానికి పైగా పూర్తయిందట. ‘పవర్’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా.. నివేదా థామస్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/