Begin typing your search above and press return to search.

ఆ సినిమా మొదటి టిక్కెట్ పది లక్షలా?

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:44 AM GMT
ఆ సినిమా మొదటి టిక్కెట్ పది లక్షలా?
X
సినిమా టిక్కెట్ల ధర ఎంత ఉంటుంది? సాదారణ ప్రేక్షకుడి విషయంలో అయితే 50 రూపాయల నుంచి 300 రూపాయల వరకూ నడుస్తుంది అని అమాయకంగా చెబుతారా? ఇది కొంతవరకూ అధికారికంగా నిజమే కావొచ్చు. కానీ.. సినిమా విడుదల సమయాల్లో బెనిఫిట్ షో అని - స్పెషల్ షో అని - ఫ్యాన్స్ షో అని... పేరు ఏదైనా వెయ్యి నుంచి 25వేల వరకూ ఒక టికెట్ట్ ధర పలుకుతున్న రోజులివి. అయితే తాజాగా విడుదల కాబోతున్న ఒక సినిమా మొదటి టిక్కెట్ ను రూ. 10 లక్షలు పెట్టి కొన్నారని తెలుస్తుంది!!

మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి నిర్మాతగా ఆయన తనయుడు హీరోగా భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన చిత్రం జాగ్వార్. ఈ చిత్రంపై శాండల్‌ వుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానున్న జాగ్వార్ చిత్రం టికెట్ల కోసం చిత్ర యూనిట్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో టికెట్ల కోసం అభిమానులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో మైసూరుకు చెందిన లోకేశ్ అనే వ్యక్తి అత్యధికంగా రూ. పది లక్షలకు ఈ సినిమా మొదటి టికెట్‌ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయంపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా.. చిత్రం విడుదల రోజున మాత్రం అధికారికంగా టికెట్‌ ను సొంతం చేసుకున్న వ్యక్తి పేరును వెల్లడించనున్నట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుమారు 16 దేశాలలో వెయ్యికి పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారట. మిల్కీ బ్యూటీ తమన్న ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/