Begin typing your search above and press return to search.

ఇంకో రెండు భాషల్లోకి జగపతిబాబు

By:  Tupaki Desk   |   15 Aug 2018 5:17 AM GMT
ఇంకో రెండు భాషల్లోకి జగపతిబాబు
X
దక్షిణాదిన ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ విలన్లలో ముందు చెప్పుకోవాల్సిన పేరు జగపతిబాబుదే. సౌత్ లోని నాలుగు భాషల్లోనూ ఆయన సినిమాలు చేస్తుండటం విశేషం. హీరోగా ఉన్నపుడు తెలుగుకే పరిమితం అయిన ఆయన.. ‘లెజెండ్’తో విలన్‌గా మారాక దక్షిణాది మొత్తానికి విస్తరించారు. తమిళంలో ‘భైరవ’.. మలయాళంలో ‘పులి మురుగన్’.. కన్నడలో ‘జాగ్వార్’ లాంటి భారీ సినిమాల్లో జగపతి నటించాడు. ఇప్పుడాయన ఉత్తరాదికి కూడా వెళ్తున్నాడు. అక్కడ రెండు కొత్త భాషల్లో జగపతిబాబు నటించనున్నట్లు సమాచారం. పంజాబీతో పాటు భోజ్ పురిలోనూ జగపతికి ఆఫర్లు వచ్చాయట. ఒక భోజ్ పురి స్టార్ డైరెక్టర్ జగపతికి ఇటీవలే ఒక ఆసక్తికర పాత్ర చెప్పి ఆయనతో ఓకే చేయించుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రం ఈ ఏడాదే మొదలవుతుందట. మరోవైపు పంజాబీలో వచ్చే ఏడాది జగపతిబాబు ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. పంజాబీ హీరోయిన్లు వచ్చి తెలుగు సినిమాల్లో నటించడమే తప్ప.. మన నటులు వెళ్లి అక్కడ సినిమాలు చేసిన దాఖలాలు లేవు. జగపతి ఈ ఘనత సాధించబోతున్నాడు. జగపతి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 32 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంలో ఆయన నటించిన ‘గూఢచారి’ ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. జగపతిబాబుకు మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఆయన ‘అరవింద సమేత’ లాంటి క్రేజీ ప్రాజెక్టుతో పాటు మూణ్నాలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇతర భాషల్లోనూ ఆయనకు సినిమాలున్నాయి. వచ్చే రెండేళ్ల వరకు ఆయన డైరీ ఖాళీ లేనట్లే కనిపిస్తోంది.