Begin typing your search above and press return to search.

జబర్ధస్త్ ఆర్పీ గురించి తెలియని విషయాలు!

By:  Tupaki Desk   |   26 July 2016 9:54 AM GMT
జబర్ధస్త్ ఆర్పీ గురించి తెలియని విషయాలు!
X
సినిమాతెరపై వెలుగులు వెలిగిస్తున్న నటుల గతం చాలామందిది విషాదంగానే ఉంటుంది. ఎన్నో కష్టాలు పడి - ఎంతో చమటోడ్చి - ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడితేనే సినిమా ఇండస్ట్రీలో రాణించగలరనేది జగమెరిగిన సత్యం. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు.. చలామందికి ఆదర్శంగా నిలిచారు. తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు - ఎదురైన ఆటుపోట్లు - ఆదర్శంగా నిలిచిన పెద్దలు - దైర్యం చెప్పిన ఆత్మీయులు.. వెరసి ప్రపంచానికి తెలియని విషయాలు చెబుతున్నాడు రాటకొండ ప్రసాద్... అదేనండి జబర్ధస్త్ ఆర్పీ.

ఇవాళ జబర్ధస్త్ ఆర్పీ గా నవ్వించే తన వెనక ఎంతో విషాదం దాగి ఉందట. ఇంట్లో పూట గడవని పరిస్థితుల్లో డిగ్రీ పరీక్షలు ఎగొట్టిమరీ సినిమాల్లో రాణించాలని హైదరాబాద్‌ వెళ్లిన ఆర్పీ అక్కడ అన్నపూర్ణ హోటల్‌ లో సప్లయర్‌ గా పనిచేస్తూ - బస్తాలు మోస్తూ వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుంటూ అవకాశాల కోసం వెతికేవాడట. ఆ పరిస్థితుల్లో ఆర్పీకి తెలిసిన విషాదకరమైన విషయం... తన తల్లి కేన్సర్‌ తో మృతి చెందడం! ఇలా ఎన్నో ఆటుపోట్లు - ఎంతో కష్టంచూసిన ఆర్పీ తర్వాతి కాలంలో గేమ్‌ - గురుడ - సాధ్యం మొదలైన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు.

అనంతరం అతడి జీవితంలో అద్భుతం జరిగింది. తాను స్వయంగా రచించిన కథను ప్రముఖ నటుడు శ్రీహరికి చెప్పడం, ఆయనకు నచ్చడంతో 2013 ఆగస్టు 13న బలశాలి సినిమాని ఆర్‌ పీ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ప్రకటించారట. అదృష్టాన్ని ఆనుకునే ఉండే దురదృష్టం కొద్దీ శ్రీహరి అక్టోబరు 9న కన్నుమూశారు. దీంతో ఆర్పీ జీవితం మరలా మొదటికి వచ్చింది. ఆ సమయంలోనే తీసిన "పిచ్చి ప్రేమ" అనే షార్ట్‌ ఫిల్మ్‌‌ కి నేషనల్‌ అవార్డు రావడం - అనంతరం జబర్ధస్త్ లో చేరడం, ఈరోజు ఆర్పీగా దూసుకుపోవడం ఇలా సాగింది ఆర్పీ ప్రయాణం!

మెగాస్టార్‌ చిరంజీవి ఒక సందర్భంలో మాట్లాడుతూ.. జబర్ధస్త్‌ లో ఆయనకు నచ్చిన నటుడు ఆర్‌ పీ అనడం అతడి జీవితంలో మరిచిపోలేని సంఘటన అయితే.. తిండి కోసం పోరాడాల్సిన స్థితి నుంచి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందం భోజనానికి ఇంటికి పిలవడం అత్యంత ఆనందకర మైన రోజట. నెల్లూరు యాసతో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే ఆర్పీ ప్రస్తుతం నేను నా భాయ్‌ ఫ్రెండ్‌ - మెంటల్‌ - రాణీ గారి బంగ్లా - అఖీరా వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.