పవన్ ఫ్యూచర్ ప్లాన్ రెడీనా?

Fri May 24 2019 13:03:45 GMT+0530 (IST)

కనీసం ఒక్క చోటైనా పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ దక్కేది. కోట్లాది అభిమానుల ఆశల్ని నీరుగారుస్తూ రెండు నియోజకవర్గాల్లో ఓటమి చవిచూడటం ఫ్యాన్స్ జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో తమ ఆవేదనని ఓ రేంజ్ లో వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడీ పరిణామం పట్ల నిజంగా సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా పవన్ తో సినిమాలు చేయాలనీ సంకల్పించుకున్న నిర్మాతలని చెప్పాలి.ఓ మూడు రోజులు మాట్లాడుకుని జనసేన గురించి పబ్లిక్ తాత్కాలికంగా మర్చిపోతారు. జగన్ కొత్త పాలన గురించి చర్చలు సాగుతాయి. అందరి చూపు అటు వైపే ఉంటుంది. ఎంత లేదన్నా ఇంకో నాలుగేళ్ళు ఇదే జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు పోషించే పాత్ర మరో వైపు అటెన్షన్ తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో పవన్ పెద్దగా చేసేది ఏమి ఉండదు. ఉద్దానం లాంటి సమస్యల కోసం ప్రజా క్షేత్రంలో పోరాడోచ్చు కాని అది ఇప్పుడు మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు

సో పవన్ ముందున్న బెస్ట్ ఆప్షన్ ఇంకో మూడేళ్ళు ఓ నాలుగైదు సినిమాలు చేసి ఓ ఎంతో కొంత నిధులు సమీకరించుకోవడం. ఊపిరి చివరి వరకు రాజకీయల్లోనే కొనసాగుతాను అని పవన్ చెప్పినప్పటికీ గ్యాప్ లో ఏం చేస్తాడు అనేదే ఆసక్తికరంగా మారింది. ఎలాగూ మైత్రి లాంటి పెద్ద బ్యానర్లు ఎప్పుడెప్పుడా అని పవన్ రక కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇదే మంచి నిర్ణయం.

మరీ కుర్ర చేష్టలు ఉండే సినిమాలు కాకుండా కాస్త ఇమేజ్ ని బాలన్స్ చేస్తూ ఉండే పవర్ ఫుల్ సబ్జెక్టులను ఎంచుకుంటే మంచిదే. కమల్ హాసన్ రజినీకాంత్ లు చేస్తోంది అదే. ఆర్థికంగా ఉపయోగపడుతుంది కూడా.ఎలాగూ ఫాలోయింగ్ విషయంలో పవన్ కు తిరుగు లేదు. దాన్ని నిలబెట్టుకునేలా కాస్త జాగ్రత్తగా కథలు ఎంచుకుంటే ఇబ్బందేమీ లేదు.

అలా కాదు జనసేన కోసమే పూర్తి స్థాయిలో అంకితం అవుతాను అంటే 175 నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో ఉన్న లోటుపాట్లను గుర్తించి దానికి తగ్గ కార్యాచరణ 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెడీ చేయాలి. ఇప్పుడు  విస్తృతంగా పర్యటనలు చేయాలి. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే పనిగా పెట్టుకోవాలి. పవన్ ఎదురుగా ఉన్నది ఈ రెండు దారులే. ఏది ఎంచుకుంటాడో కాలమే నిర్ణయించాలి