#మీటూ కాదు #బీ రియల్ అంటున్న హీరోయిన్!

Wed Oct 24 2018 07:40:45 GMT+0530 (IST)

#మీటూ కాంపెయిన్ అనేది ఒక జటిలమైన సమస్య.  ఎందుకంటే ఒక మహిళ తనకెదురైన లైంగిక వేధింపులను బహిర్గతం చేయడం.. అందుకు కారణం అయిన వారి పేర్లు చెప్పడం మన భారత దేశ సమాజంలో ఆషామాషీ విషయం కాదు.  దానికి కారణాలు మనకు తెలిసినవే.  ఇలాంటి వాటిలో 90% ఆరోపణలకు ఋజువులు ఉండకపోవడం ఒక కారణం కాగా రెండో ముఖ్య కారణం ఆరోపణలు చేసిన వ్యక్తులనే సమాజం తక్కువగా చూడడం.  ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భారతదేశంలో  #మీటూ ఉద్యమం మాత్రం ఊపందుకుంది.  కానీ ఒక ఇబ్బంది ఏంటంటే ఎవరి మీద ఆరోపణలు వచ్చినా వారు తప్పు చేశారన్నట్టుగా ప్రచారం సాగడం. మన చట్టం ప్రకారం కోర్టు తీర్పులో నేరస్తుడు అని తేలేవరకూ ఎవరైనా నిందితుడు మాత్రమే.. నేరస్తుడు కాదు.అయినా... ఇప్పుడు ఎవరి మీద ఆరోపణలు వస్తే వారిని నేరస్తులుగా దాదాపు అందరూ ఫిక్స్ అవుతున్నారు. 90% మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. కానీ కన్నడ హీరోయిన్ హర్షిక పూనాచా తన ట్విట్టర్ ఖాతా ద్వారా #మీటూ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది.  హర్షిక చెప్పేదేంటంటే తను 10 ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్నానని.. ఒక స్ట్రాంగ్ వుమన్ గా ఇందులో ఉన్న మంచి చెడు అంతా స్వయంగా చూశానని అంటోంది.  మహిళలను ఇబ్బంది పెట్టడం అనేది ఏ రూపంలోనైనా ఖండించాల్సిన విషయమేనని చెప్పింది.  

కానీ కొంతమంది హీరోయిన్లు చేసే తప్పుడు ఆరోపణలు వల్ల తను ఈరోజు బయటకువచ్చి మాట్లాడుతున్నానని తెలిపింది.  "#మీటూ కాంపెయిన్ లో పాలుపంచుకుంటున్నవారిలో అధికభాగం ఎలా ఉన్నారంటే.. తమ కెరీర్ మొదట్లో డబ్బు.. అవకాశాలు.. హైఫై లైఫ్ కోసం అన్నిటిలో కాంప్రమైజ్ అయ్యి వారి చుట్టూ ఉన్న మగాళ్ళకు పూర్తి ఫ్రీడం ఇచ్చారు.. ఇప్పుడు మాత్రం పబ్లిసిటీ కోసం.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిపై ఆరోపణలు చేస్తున్నారు. మీరు వాళ్ళ పక్కలోకెళ్ళినప్పుడు #మీటూ ఏమైంది?" అని ప్రశ్నించింది.

ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నవారిలో కొంతమంది గంజాయి తాగుతూ ఫారెన్ లోకేషన్స్ లో ప్రొడ్యూసర్స్ తో.. హీరోలతో.. రియల్ ఎస్టేట్స్ బిగ్ షాట్స్ తో మలేషియా.. దుబాయి.. సింగపూర్ లాంటి దేశాలలో గడపడం నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళకు డబ్బు స్టేటస్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇక వారితో అవసరం లేదు కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు. సరే మీలో ఎవ్వరూ అన్నీ ఇండస్ట్రీలనుండి A  లిస్టు సూపర్ స్టార్ల పేర్లు చెప్పడం లేదెందుకు?  స్టార్ హీరోయిన్స్ దీని గురించి ఎందుకు మాట్లాడం లేదు?  నాకు తెలిసిన ఒక నిర్మాత ఇలాంటి హీరోయిన్లు డ్రగ్స్ తీసుకుంటూ హీరోల భుజాలపై వాలి ఉన్న వీడియోలు కూడా చూపించాడు.  ఒక హీరోయిన్ అందులో అర్థనగ్నంగా ఉంది... నెక్స్ట్ సినిమాలో నాకు ఛాన్స్ ఖాయం కదా అంటోంది.     

నిజమే. కొంతమంది మగాళ్ళు చెడ్డవాళ్ళు.  కానీ వాళ్ళను వాడుకుంటూ మీరు మీ కెరీర్లో ఎదగాలని ప్రయత్నించి ఇప్పుడు పూర్తిగా వాళ్ళతో అవసరం తీరిపోయాక ఆరోపణలు చేస్తారా...? వాడుకుంది వాళ్ళా.. మీరా? మీకు ఇష్టం లేనపుడు ఎందుకు ఒప్పుకున్నారు? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు.  హీరోయిన్లు అందరికీ అందరికీ  నేను చెప్పేదేంటంటే.. ముందు మనం నిజాలు ఏంటి అని అలోచించాలి #బీ రియల్. అంతే కాదు.  మగాళ్ళు #వుయ్ టూ కాంపెయిన్ మొదలు పెట్టాలి.  ఎందుకంటే వాళ్ళను వాడుకున్న హీరోయిన్లు నాకు చాలామంది తెలుసు.  చాలారోజులనుండి నేను #మీటూ గురించి  మాట్లాడాలా వద్దా అని అలోచిస్తూ ఉన్నా. కానీ మనకు అన్నం పెట్టిన పరిశ్రమ ను ఇలా చేస్తున్నారేంటి అనే ఆలోచనతో నేను మాట్లాడాల్సి వస్తోంది.