ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్ చేశాడండోయ్

Thu May 17 2018 13:57:12 GMT+0530 (IST)

21వ శతాబ్దంలో ఇండియన్ సినిమా నుంచి వచ్చిన అత్యుత్తమ నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకడు. ఆయన ప్రతిభను హాలీవుడ్ వాళ్లు కూడా గుర్తించారు. ‘లైఫ్ ఆఫ్ పై’.. ‘జురాసిక్ వరల్డ్’ లాంటి సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఇక ఇర్ఫాన్ బాలీవుడ్ సినిమాల్లో చూపించిన నట కౌశలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత గొప్ప నటుడు.. అరుదైన వ్యాధికి గురై ప్రాణాలతో పోరాడుతున్నాడన్న వార్త సినీ ప్రియులకే కాక సామాన్యులకూ వేదన కలిగించింది. ఆయన వ్యాధి ఏంటన్నదానిపై స్పష్టత లేదు. అసలు ఇర్ఫాన్ వాస్తవ పరిస్థితి ఏంటో కూడా తెలియదు. ఆయన జీవిత చరమాంకంలో ఉన్నారని.. మృత్యు ఒడికి చేరువగా ఉన్నారని.. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటిపై ఇర్ఫాన్ కుంటుంబం ఏమాత్రం స్పందించలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది.ఐతే కొన్ని రోజులుగా ఇర్ఫాన్ గురించిన వార్తలు ఆగిపోయి.. అందరూ ఆయన గురించి ఆలోచించడం మానేయగా.. ఇప్పుడు సడెన్ గా ఇర్ఫాన్ వార్తల్లోకి వచ్చాడు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఇర్ఫాన్ నటించిన కొత్త సినిమా  ‘కార్వాన్’ ఆగస్టు 10న ప్రేక్షకలు ముందుకు రాబోతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. దాని గురించి ఇర్ఫాన్ స్పందించడం విశేషం. ‘కార్వాన్’ ఫస్ట్ లుక్ ను షేర్ చేస్తూ ‘రెండు ప్రయాణాలు.. ఒకటి నాది.. ఇంకోటి సినిమాది’ అంటూ నర్మగర్భమైన వ్యాఖ్య చేశాడు ఇర్ఫాన్. ‘కార్వాన్’ ఇద్దరు మిత్రుల జీవిత ప్రయాణం నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్టోరీ అంటున్నారు. ఇది ఇర్ఫాన్ బాగా ఇష్టపడి చేసిన సినిమా అట. అమెరికాలో చికిత్స తీసుకుంటున్న ఇర్ఫాన్ రెండు నెలల తర్వాత ఇలా ట్వీట్ చేయడం సినీ ప్రియులకు ఆనందం కలిగించింది. ‘కార్వాన్’కు ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దుల్కర్ నటిస్తునన తొలి బాలీవుడ్ సినిమా ఇదే కావడం విశేషం.