Begin typing your search above and press return to search.

ప్రభుదేవాకు ఆ రోజు కాలేజీలో సీటొచ్చి ఉంటే..

By:  Tupaki Desk   |   7 Dec 2018 3:28 AM GMT
ప్రభుదేవాకు ఆ రోజు కాలేజీలో సీటొచ్చి ఉంటే..
X
దేశం గర్వించదగ్గ కొరియోగ్రాఫర్లలో సుందరం ఒకరు. ఏకంగా 1200 సినిమాలకు కొరియోగ్రఫీ చేశారాయన. సుందరం వారసత్వాన్నందుకుని డ్యాన్స్ మాస్టర్ అయిన తనయుడు ప్రభుదేవా ఆయన్ని మించి పేరు సంపాదించారు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే నంబర్ వన్ డ్యాన్స్ మాస్టర్ అనిపించుకున్నాడు. ఇండియన్ మైకేల్ జాక్సన్‌ గా పేరు తెచ్చుకున్నాడు. ఐతే ఇంతటి ప్రతిభావంతుడైన ప్రభుదేవాను నిజానికి సుందరం డ్యాన్స్ మాస్టర్ గా చేయాలని అనుకోలేదట. అతడిని ఉన్నత చదువులు చదివించి పెద్ద ఉద్యోగాలు చేయించాలని అనుకున్నారట. తనకు సరిగా చదువు రాకపోవడం వల్ల అవమానాలు ఎదుర్కోవడంతో తన పిల్లలు తనలా అవ్వకూడదనుకున్నారట. కమల్ హాసన్ లాంటి వాళ్లు పిల్లల్ని విదేశాలకు పంపి చదివించమని కూడా సలహా ఇచ్చారట.

ఐతే ప్రభుదేవాకు కాలేజీలో సీటు దొరక్కపోవడంతో వచ్చి బాధతో ఇంటికొచ్చి పడుకున్నాడని.. అప్పుడే మణిరత్నంతో తాను చేస్తున్న ‘మౌనరాగం’ సినిమాకు ఆరుగురు డ్యాన్సర్లలో ఒకరు తక్కువ పడటంతో అతడిని వెంట తీసుకుని ఊటీ వెళ్లానని చెప్పారు సుందరం. అప్పటి వరకు ప్రభు తనతో ఎప్పుడూ షూటింగుకి రాలేదని.. ఆ రోజు పాటలో అతడి డ్యాన్స్ చూసి అందరూ మెచ్చుకున్నారని.. అలా అనుకోకుండా ప్రభు కెరీర్ మొదలై.. తర్వాత అతనూ డ్యాన్స్ మాస్టర్ అయి తనను మించి పోయాడని చెప్పారు సుందరం. ఐతే సినిమాల్లోకి వస్తారో లేదో కానీ.. తన ముగ్గురు పిల్లలకూ డ్యాన్స్ అయితే తెలుసుండాలని క్లాసికల్ సహా అన్నీ ముందే నేర్పించానని సుందరం తెలిపారు. ఐతే ఆ రోజు ప్రభుదేవాకు కాలేజీలో సీటు వచ్చి ఉంటే మాత్రం అతడి జీవితం ఎలా ఉండేదో అని ఆయనన్నారు.