రాజమౌళి ఇలియానాతో మాట్లాడాడా?

Tue Apr 17 2018 18:26:49 GMT+0530 (IST)

బాలీవుడ్ వెళ్లిపోయాక సౌత్ సినిమా గురించి పలుమార్లు తక్కువ చేసి మాట్లాడింది ఇలియానా. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి ఆమె ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పేరు ఎత్తితే ఏం మాట్లాడుతుందా అని ఆసక్తి కలగడం ఖాయం. ఎందుకంటే రాజమౌళితో ఇలియానా ఎపుడూ సినిమా చేసింది లేదు. ఐతే తాను నటించిన ఒక సినిమా గురించి రాజమౌళి అప్పట్లో తనతో మాట్లాడినట్లు ఆమె వెల్లడించింది. ఆ సినిమా చూస్తూ చాలా ఇబ్బంది పడ్డానని.. అతి కష్టం మీద సినిమాను భరించానని.. కానీ అందులో తన పాత్ర.. నటన మాత్రం ఆకట్టుకున్నాయని రాజమౌళి చెప్పినట్లుగా ఇలియానా వెల్లడించడం విశేషం.ఒక సినిమా ఎలా ఉన్నా మన పెర్ఫామెన్స్ బాగుండాలని.. ఎలాంటి సినిమాలో అయినా వంద శాతం అంకితభావంతో పని చేయాలని.. అప్పుడే సినిమా ఆడకపోయినా ప్రశంసలు దక్కుతాయని రాజమౌళి తనకు సలహా ఇచ్చాడని ఇలియానా గుర్తు చేసుకుంది. ఆ సలహాను పాటిస్తున్నానని.. అదే సమయంలో తన పాత్రల్ని ఆచితూచి ఎంచుకుంటున్నానని ఇలియానా చెప్పింది. ఈ మధ్య ఒక సినిమాకు తాను నో చెప్పానని.. అందులో తాను అందంగా కనిపిస్తాను తప్ప అంతకుమించి ప్రత్యేకత ఏమీ ఉండదనిపించిందని.. అందులో చాలా పెద్ద నటీనటులు నటించారని.. అయినా నో చెప్పానని ఇలియానా వెల్లడించింది. ఒక సినిమా చేయలేనని చెప్పగలిగే స్థాయి ఉండటం చాలా ముఖ్యమని చెప్పడం ద్వారా తాను ఆ స్థాయిలోనే ఉన్నానని చెప్పకనే చెప్పింది ఇల్లీ బేబీ.