Begin typing your search above and press return to search.

ఇలియానా.. ఆ కామెంట్ల మాటేంటో!

By:  Tupaki Desk   |   21 May 2018 3:43 PM GMT
ఇలియానా.. ఆ కామెంట్ల మాటేంటో!
X
సౌత్‌లో అవకాశాలు వచ్చినంత కాలం దీన్ని మించిన ఇండస్ట్రీ లేదంటారు బాలీవుడ్ భామలు. కానీ ఇక్కడ దుకాణం సర్దేసి బాలీవుడ్ వెళ్లిపోయాక మాత్రం ఈ ఇండస్ట్రీ చిన్నగా కనిపిస్తుంది. దీని గురించి అవాకులు చెవాకులు పేలతారు. ఇలియానా.. తాప్సి లాంటి ఈ కోవకే చెందుతారు. వీళ్ల టాలెంటుని సౌత్ ఫిలిం మేకర్స్ గుర్తించలేదట. గ్లామర్ రోల్స్‌కే పరిమితం చేశారట. వీళ్లు ఎప్పుడూ వినిపించే సోది ఇది. గ్లామర్ రోల్స్ అంటే ఇష్టం లేనపుడు వాటిని తిరస్కరించవచ్చు కదా.. కానీ అలా ఏమీ చేయలేదు. చేతికొచ్చిన ప్రతి పాత్రనూ అంగీకరించాడు. భారీగా పారితోషకాలు పుచ్చుకున్నారు. అందాలు ఆరబోశారు. కానీ ఇప్పుడు మాత్రం భిన్నమైన స్వరం వినిపిస్తారు. ఇలియానా కొన్ని నెలల కిందట కూడా సౌత్ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడింది. కానీ ఆమె ఇప్పుడు ఒక తెలుగు సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

శ్రీను వైట్ల-రవితేజ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ నుంచి అను ఇమ్మాన్యుయెల్ తప్పుకోవడంతో ఇలియానాను ఆ పాత్రకు ఎంచుకున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్లో ఇల్లీకి అవకాశాలేమీ లేకపోవడంతో దాదాపుగా ఈ సినిమాను ఓకే చేసినట్లే అంటున్నారు. మరి వైట్ల-రవితేజ సినిమా అంటే అది ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమేమీ కాదు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయ్యుంటుంది. హీరోయిన్ పాత్రకు కచ్చితంగా గ్లామర్ టచ్ ఉంటుంది. ఇలియానా బాలీవుడ్లో చేసినటువంటి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లాగా అయితే ఇది ఎంతమాత్రం ఉండే అవకాశం లేదు. మరి ఇప్పుడు హిందీలో సెలక్టివ్‌ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఇల్లీ.. తెలుగుకు వచ్చేసరికి రొటీన్ క్యారెక్టర్ ఒప్పేసుకుంటుందా? ఆమె ఈ సినిమా ఓకే చేస్తే తప్పెవరిది అవుతుంది? ఇంతకుముందు ఆమె చేసిన కామెంట్ల మాటేంటి? ఒకవేళ ఆ సినిమా ఓకే అయి.. ఇలియానా టాలీవుడ్‌కు తిరిగొచ్చి మీడియాకు దొరికితే మాత్రం అంతే సంగతులు.