# మెర్సల్: బీజేపీ నేతకు మంచు విష్ణు రిటార్ట్!

Mon Oct 23 2017 18:07:04 GMT+0530 (IST)

ఇళయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ చిత్రంలో జీఎస్టీ డైలాగుల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. మొదట తమిళనాడు వరకే పరిమితమైన ఈ వివాదం క్రమక్రమంగా జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతోంది. కోలీవుడ్ - టాలీవుడ్ - బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాదంలో మెర్సల్ కు మద్దతు తెలుపుతున్నారు. కమల్ హాసన్ - రజనీకాంత్ - వి.విజయేంద్రప్రసాద్ - విశాల్ తదితరులు మెర్సల్ కు బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వివాదంపై బీజేపీ నేతల వివాదాస్పద విమర్శలు ఆగడం లేదు. ఆ చిత్రంపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చేసిన సంచలన వ్యాఖ్యలపై హీరో మంచు విష్ణు తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నరసింహారావు కామెంట్లకు విష్ణు అదిరిపోయే రిటార్ట్ ఇచ్చాడు.మెర్సల్ వివాదం జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతోంది. దేశంలో అసలు సమస్యలే లేవన్నట్లుగా ప్రవర్తిస్తున్న బీజేపీ మెర్సల్ వివాదాన్ని జాతీయవిపత్తుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ ఎన్ రావు ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మెర్సెల్' సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సినీ నటుల్లో ఎక్కువ మందికి బుర్ర లేదని - వారికి జనరల్ నాలెడ్జ్ కూడా తక్కువని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలపై మంచు విష్ణు  ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమా స్టార్లకు ఐక్యూ & జీకే ఉండదు అనుకుంటే.. మరి రాజకీయ నాయకులంతా అవినీతి పరులు - దొంగలా? అని ప్రశ్నించాడు. మన దేశంలో గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు కూడా అయ్యారని గుర్తు చేశాడు. ఎన్టీఆర్ - ఎంజీఆర్ - జయలలిత వంటి ముగ్గురి పేర్లను విష్ణు ఉదహరించారు. ఒకరి అభిప్రాయం వెల్లడించడానికి జీకేతో పనిలేదని స్పష్టం చేశాడు. తాను హిందూ అయి ఉండి ఓ క్రైస్తవ యువతిని పెళ్లి చేసుకున్నానని తాను హిందు మతాన్ని అనుసరిస్తానని  విష్ణు అన్నాడు. తాను హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతానన్నాడు. అదే సమయంలో బీజేపీపై తనకు గౌరవముందని మోదీ అంటే అమితమైన అభిమానమని తెలిపాడు. కాగా బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా నరసింహారావు వ్యాఖ్యలపై మండిపడ్డాడు. ''మీకు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటారు....చూస్తుంటే బీజేపీ ఈ మెర్సల్ వివాదంలో సెల్ఫ్ గోల్ వేసుకునేలా కనిపిస్తోంది'' అని ఫర్హాన్ అన్నాడు. మరో వైపు యూపీ - బిహార్ వంటి రాష్ట్రాలలో గోరక్షక దాడులు - మహిలలపై లైంగిక దాడులు - అత్యాచారాలు - రైతుల ఆత్మహత్యలు వంటి ప్రధాన సమస్యలను బీజేపీ గాలికి వదిలేసి....మెర్సల్ లో డైలాగుల వివాదంపై  ప్రత్యేక శ్రద్ధ చూపించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.