Begin typing your search above and press return to search.

RRR: దేవ‌గ‌న్ నో చెబితే కిలాడీని దువ్వాడు!

By:  Tupaki Desk   |   10 Feb 2019 7:41 AM GMT
RRR: దేవ‌గ‌న్ నో చెబితే కిలాడీని దువ్వాడు!
X
అజ‌య్ దేవ‌గ‌న్ లాస్ .. కిలాడీ అక్షయ్ కుమార్ కి గెయిన్ కాబోతోందా? దేవ‌గ‌న్ కాద‌నుకున్న ఓ క్రేజీ ఆఫ‌ర్ ని కిలాడీ అక్ష‌య్ ల‌ట‌క్కున క్యాచ్ చేశారా? అంటే అవున‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇండియా నంబ‌ర్ 1 డైరెక్ట‌ర్.. బాహుబ‌లి ఫేం ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఆఫ‌ర్ చేసిన పాత్ర‌ను కాద‌నుకుని దేవ‌గ‌న్ త‌ప్పు చేశార‌ని, సేమ్ టైమ్ కిలాడీకి అది క‌లిసొచ్చింద‌ని ఓ కొత్త టాక్ ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. అస‌లింత‌కీ ఈ ప్ర‌చారంలో నిజం ఎంత‌? అబ‌ద్ధం ఎంత‌? అన్న‌ది తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

ది గ్రేట్ ఎస్.ఎస్.రాజ‌మౌళి ప్ర‌స్తుతం RRR లాంటి భారీ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఈ చిత్రంలో క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌ధాన విల‌న్ ఎవ‌రు? అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ స‌స్పెన్స్. ఓవైపు రెండో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే రాజ‌మౌళి ప‌లువురు విల‌న్ల‌ పేర్ల‌ను ప‌రిశీలించార‌ట‌. అందులో తొలిగా బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ఓ ఆప్ష‌న్ అని తెలుస్తోంది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఈగ` చిత్రానికి హిందీ వెర్ష‌న్ డ‌బ్బింగ్ చెప్పారు దేవ‌గ‌న్ - కాజోల్ జంట‌. ఆ చొర‌వ‌తోనే అజ‌య్ దేవ‌గ‌న్ ని రాజ‌మౌళి సంప్ర‌దించార‌ట‌. ఆర్.ఆర్.ఆర్ లో కీల‌క పాత్ర‌లో న‌టించాల్సిందిగా కోరార‌ట‌. అయితే దేవ‌గ‌న్ ఆ ఆఫ‌ర్ ని తిర‌స్క‌రించార‌ని తెలుస్తోంది.

అతడు ఆ ఆఫ‌ర్ ని కాద‌నుకోగానే రాజ‌మౌళి వెంట‌నే కిలాడీ అక్ష‌య్ ని సంప్ర‌దించార‌ని, అయితే ఇంకా ఇది చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంద‌ని తెలుస్తోంది. ఒక‌వేళ అక్ష‌య్ ఈ సినిమాని అంగీక‌రిస్తే అత‌డు సెలెక్ట్ చేసుకున్న రెండో అతిపెద్ద సౌత్ సినిమా అవుతుంది. శంక‌ర్ 2.0 త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ అక్కీకి పెద్ద ప్ల‌స్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక అజ‌య్ దేవ‌గ‌న్ ఇదివ‌ర‌కూ `భార‌తీయుడు 2` ఆఫ‌ర్ ని కాద‌నుకున్నారు. దాదాపు 300కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఆర్.ఆర్.ఆర్ ను కాద‌నుకోవ‌డంతో రెండోసారి క్రేజీ ఆఫ‌ర్ ని కోల్పోయార‌ని విశ్లేష‌ణ సాగుతోంది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత టైమ్స్ న‌వ్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించ‌డం సంచ‌ల‌న‌మైంది. అలాగే ఈ చిత్రంలో క‌థానాయిక‌ల్ని ఎంపిక చేయాల్సి ఉంది. బాలీవుడ్ భామలు జాన్వీ, ఆలియా, ప‌రిణీతి వంటి నాయిక‌ల పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.