Begin typing your search above and press return to search.

బాబాయ్ అడిగితే రెడీ

By:  Tupaki Desk   |   18 March 2018 12:53 PM GMT
బాబాయ్ అడిగితే రెడీ
X
వచ్చే వారం విడుదల కానున్న ఎమెల్యే కోసం కళ్యాణ్ రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పటాస్ తరహాలో మంచి మాస్ హిట్ అవుతుందని తనతో పాటు నందమూరి ఫాన్స్ కూడా ఆశిస్తున్నారు. దీని ప్రమోషన్ కోసం విస్తృతంగా అందుబాటులో ఉన్న కళ్యాణ్ రామ్ పలు విషయాల గురించి ఓపెన్ గా షేర్ చేసుకున్నాడు. తాతయ్య ఎన్టీఆర్ ఆత్మకథను ఆధారం చేసుకుని బాబాయ్ బాలకృష్ణ తీస్తున్న బయోపిక్ గురించి తనకు ఏమి తెలియదని, ఒకవేళ అందులో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే మిస్ కాకుండా చేస్తానని చెప్పాడు. మొత్తానికి తనకు కాని తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కు కాని బయోపిక్ కు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నట్టే. కాని రెండు నెలల క్రితం కళ్యాణ్ రామ్ పెద్దబ్బాయి ఎన్టీఆర్ చిన్ననాటి ఎపిసోడ్ లో నటిస్తున్నాడు, వాటికి సంబంధించిన ట్రయిల్ షూట్ కూడా పూర్తయ్యిందని వార్తలు వచ్చాయి.

కళ్యాణ్ రామ్ ఆ ప్రాజెక్ట్ గురించి తనకేమి తెలియదు అంటున్నాడు అంటే అది కూడా నిజమైన వార్త కాదేమోనన్న అనుమానం కలగక మానదు. కళ్యాణ్ రామ్ కు బాలకృష్ణతో తెర మీద అనుబంధం ఇప్పటిది కాదు. ఇరవై ఏళ్ళ క్రితం బాలకృష్ణ హీరోగా వచ్చిన బాలగోపాలుడు సినిమాలో హీరోతో సమానంగా ట్రావెల్ చేసే బాల నటుడి పాత్రలో కళ్యాణ్ రామ్ అప్పట్లోనే పేరు తెచ్చుకున్నాడు. అందులో ఇతనికి చెల్లెలుగా హీరొయిన్ రాశి పాప పాత్రలో కనిపిస్తుంది. ఒకవేళ బాబాయ్ పిలిచి చేయమంటే అందులో నటిస్తాను అంటున్న కళ్యాణ్ రామ్ అదే కనక నిజమైతే ఇన్నేళ్ళ తర్వాత తాను హీరో అయ్యాక బాబాయ్ తో మళ్ళి నటించిన అపురూప క్షణం అవుతుంది.

ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు మొదలుపెడతారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్న బాలకృష్ణ ప్రస్తుతం స్క్రిప్ట్ మీద వర్క్ చేయిస్తున్నట్టు టాక్. దర్శకుడు తేజ మరోవైపు వెంకటేష్ సినిమాతో బిజీ కావడం చూస్తుంటే ఇది మరికొంత కాలం ఆలస్యం అయ్యేలా ఉంది. స్టార్ కాస్ట్ సెట్ చేయటం పెద్ద ఛాలెంజ్ గా మారిన ఎన్టీఆర్ లో కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి హీరోలందరూ ఏదో ఒక పాత్రలో కనిపిస్తే కనులవిందుగా ఉంటుందని అభిమానుల కోరిక.