రాజమౌళి కంటే బాగా తీసిన డైరెక్టర్

Mon Jul 17 2017 21:56:59 GMT+0530 (IST)

బాహుబలి సిరీస్ తో.. ఎస్ ఎస్ రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. కమల్ హాసన్ లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే.. మొత్తం దేశమంతా రాజమౌళి రూపొందించిన మూవీని ప్రశంసల్లో ముంచెత్తింది. రాజమౌళి ఊహాశక్తికి.. దర్శకత్వ ప్రతిభకు ప్రతీ ఒక్కరూ సలాం కొట్టేశారు. మరి రాజమౌళి కంటే బాగా తీసే డైరెక్టర్ ఎవరు అనే మాటకు సమాధానం చెప్పడం కష్టమే కానీ.. ఓ కుర్రాడు మాత్రం బాహుబలిలో కొన్ని సన్నివేశాలను తను తెరకెక్కించినట్లు చెప్పడమే కాదు.. రాజమౌళి కంటే తానే బెటర్ గా పిక్చరైజ్ చేసినట్లు.. నేరుగా రాజమౌళికే చెప్పాడు.

అతనెవరో కాదు.. రాజమౌళి కుమారుడు కార్తికేయ. బాహుబలి సిరీస్ లో భల్లాలదేవుడిగా మెప్పించిన రానా.. ప్రస్తుతం నెంబర్ 1 యారీ అనే టెలివిజన్ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఈ కార్యక్రమంలో ఓ సెలబ్రిటీకి ఫోన్ చేసి.. రానా చెప్పినట్లుగా చెప్పాల్సి ఉంటుంది. అందులో భాగంగా.. రాజమౌళికి ఫోన్ చేయాలని కార్తికేయకు చెప్పిన రానా.. తండ్రి కంటే తను తీసిన సీన్స్ బాగున్నాయని జనాలు అనుకుంటున్నట్లుగా చెప్పాలని సూచించాడు.

కాసింత జంకుతూనే రాజమౌళికి ఫోన్ చేసి.. రానా చెప్పినట్లే చెప్పాడు కార్తికేయ. అయితే.. ఆ సీన్స్ నువ్వే తీశానని చెప్పడానికి.. మనమేమైనా సబ్ టైటిల్స్ వేశామా అంటూ జక్కన్న క్వశ్చన్ చేయడంతో.. ఆ వెంటనే రానా అలా చెప్పమన్నట్లుగా కార్తికేయ ఓపెన్ అయిపోవడం జరిగిపోయాయి. మొత్తానికి ఇది నెంబర్ 1 యారీ ప్రోగ్రామ్ కోసం అని అర్ధం కావడంతో.. అంతా తెగ నవ్వేసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో కార్తికేయతో పాటు అక్కినేని అఖిల్ కూడా పాల్గొనడం విశేషం.