Begin typing your search above and press return to search.

అందుకోసం ఎన్ని సార్లైనా తల్లినవుతా: అనసూయ షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   15 May 2019 4:31 PM GMT
అందుకోసం ఎన్ని సార్లైనా తల్లినవుతా: అనసూయ షాకింగ్ కామెంట్స్
X
అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై కనిపిస్తూ సందడి చేస్తోంది ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్. నటన, అందం కలగలపిన అమ్మాయి కావడంతో తెలుగు ప్రేక్షకులు అనతి కాలంలోనే ఆమెను ఆదరించారు. అందుకే అనసూయ అనే పేరు పరిచయం అవసరం లేనంతగా మారిపోయింది. వాస్తవానికి మొదట ఓ న్యూస్ చానెల్‌ లో పని చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో బాగా ఫేమస్ అయిపోయింది. ఈ షో భారీ హిట్ కావడంతో అమ్మడికి ఎన్నో చానెళ్ల నుంచి అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. ఇలా టీవీ షోలు చేస్తున్న క్రమంలోనే సినిమా అవకాశాలు కూడా దక్కాయి. దీంతో చేతి నిండా టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది ఈ హాట్ బ్యూటీ.

శశాంక్ భరద్వాజ్‌ ను వివాహమాడిన అనసూయ.. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ విషయం ప్రత్యేకంగా చెబితే గానీ ఎవరూ గుర్తించలేరు. అంతగా ఆమె గ్లామర్‌ ను మెయింటైన్ చేస్తోంది. తాజాగా అనసూయ ఓ చానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలను పంచుకుంది. ముఖ్యంగా తన పిల్లల గురించి, అమ్మతనం, అమ్మాయి లేని లోటు గురించి మాట్లాడింది. ‘‘అమ్మతనం అనేది ఎంతో ముఖ్యమైనది. దీనిని అందరూ సాధారణంగా తీసుకుంటారు. కానీ, పిల్లలు లేని వారికి ఆ విలువ బాగా తెలుస్తుంది. ఎంత ఎక్కువ మంది ఉంటే ఇల్లు అంత కళగా ఉంటుంది.

ఉదాహరణకు మా అమ్మమ్మనే తీసుకుంటే.. ఆమెకు ఎనిమిది మంది పిల్లలు. వాళ్లంతా ఒక దగ్గర ఉంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. ఇక నా విషయానికొస్తే.. మేము పిల్లలు కావాలని అనుకున్నప్పుడు మొదటి కాన్పులో అబ్బాయే పుట్టాలని అనుకున్నాను. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు ఆడపిల్లలం. కాబట్టి నాకు అబ్బాయే పుట్టాలని గట్టిగా అనుకున్నాను. అదే నిజమై నాకు అబ్బాయే పుట్టాడు. ఇక రెండో సారి మాత్రం అమ్మాయి కావాలని బాగా కోరుకున్నాం. కానీ, అప్పుడు కూడా అబ్బాయే పుట్టాడు. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉండడం వల్ల అమ్మాయి లేని లోటు కనిపిస్తుంది. నాకు అవకాశం దొరికి పిల్లలు కానాలి అనుకున్నప్పుడు అమ్మాయి కోసం ఎదురు చూస్తాం. అసలు అమ్మాయి పుట్టేంత వరకు ఎన్ని సార్లు తల్లైనా పర్లేదు అనిపిస్తుంది. ఎవరైనా మీకెంత మంది పిల్లలు అని అడిగితే ఇద్దరు అబ్బాయిలు అని చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది.