Begin typing your search above and press return to search.

అవార్డుల కంటే ఆదరణ.. వసూళ్లు ముఖ్యం-రాజమౌళి

By:  Tupaki Desk   |   25 Sep 2017 4:18 PM GMT
అవార్డుల కంటే ఆదరణ.. వసూళ్లు ముఖ్యం-రాజమౌళి
X
రాజమౌళి ‘బాహుబలి: ది బిగినింగ్’ తీసినపుడు దానికి అవార్డుల వర్షం కురుస్తుందనుకున్నారు. ఆస్కార్ దాకా వెళ్లిపోతుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీకి కూడా ఆ సినిమా ఎంపిక కాలేదు. ఈ ఏడాది ‘బాహుబలి: ది కంక్లూజన్’ విషయంలోనూ ఇలాంటి అంచనాలే నెలకొన్నాయి. కానీ ఈసారి కూడా నిరాశ తప్పలేదు. ఆస్కార్ ఎంట్రీకి ఈ సినిమాను పరిగణనలోకి తీసుకోలేదు. 2 వేల కోట్ల దాకా వసూళ్లు రాబట్టినప్పటికీ ఆస్కార్ ఎంట్రీ కోసం ఏర్పాటైన కమిటీ మాత్రం ఈ సినిమాను పట్టించుకోలేదు. ఇది ‘బాహుబలి’ ప్రియుల్ని నిరాశకు గురి చేసింది. ఐతే రాజమౌళి మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నాడు. అవార్డులనేవి తనకెప్పుడూ ప్రయారిటీ కాదని చెప్పాడు.

‘‘నేనో సినిమా తీసేటపుడు అవార్డుల గురించి ఎంతమాత్రం ఆలోచించను. అది నా లక్ష్యమే కాదు. ముందు ఓ కథతో నన్ను నేను సంతృప్తిపరుచుకోవాలి. ఆ తర్వాత సాధ్యమైనంత ఎక్కువమందికి ఈ కథ చేరేలా సినమా తీర్చిదిద్దాలి. ఆ సినిమా కోసం కష్టపడి పని చేసి.. దాన్ని నమ్ముకున్న అందరికీ డబ్బులు తెచ్చిపెట్టాలి. ప్రేక్షకాదరణతో పాటు సినిమా కోసం పని చేసిన.. పెట్టుబడి పెట్టిన అందరికీ డబ్బులు రావడం అన్నింటికంటే ముఖ్యం. నాకు.. నా సినిమాకు అవార్డులు వస్తే సంతోషమే. ఐతే అవార్డులు రాలేదంటే నేనస్సలు పట్టించుకోను. ఎందుకంటే వాటికి నేనంత ప్రాధాన్యం ఇవ్వను’’ అని రాజమౌళి స్పష్టం చేశాడు. తాను ఇంకా బాహుబలి మాయలోంచి బయటికి రాలేదని ఈ సందర్భంగా జక్కన్న అన్నాడు.