5 లక్షల బ్యాక్ గ్రౌండ్ చెప్పిన హైపర్ ఆది

Mon Apr 16 2018 11:39:07 GMT+0530 (IST)

జబర్దస్త్ పేరు విన్నంతనే గుర్తుకు వచ్చే వారు కొందరుంటారు. అలాంటి వారిలో త్వరగా గుర్తుకు వచ్చే పేర్లలో హైపర్ ఆది ఒకరు. ఎటకారానికి నిలువెత్తు రూపంగా కనిపిస్తారు. మాటలతో పోట్లు పొడితే ఆది నోరు తెరిస్తే పంచ్ లే.. పంచ్ లు. అతగాడి మాట విరుపుకు ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే. ఈ మధ్యనే సినిమాల్లోనూ కనిపిస్తున్న హైపర్ ఆది తనకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.తమది ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రామమని.. వ్యవసాయ కుటుంబమని చెప్పాడు. కందుకూరులోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో 2012లో బీటెక్ పూర్తి చేసిన తనకు టీసీఎస్ లో జాబ్ వచ్చిందన్నారు. ఐటీ ఎంప్లాయిగా టీసీఎస్ లో రెండేళ్లు జాబ్ చేసిన తర్వాత అసంతృప్తితో తన జాబ్ కు రిజైన్ చేసినట్లు చెప్పాడు.

తాను జాబ్ కు రిజైన్ చేసేటప్పుడు ఐదు లక్షల రూపాయిల ప్యాకేజీని వదులుకొని మరీ.. టాలెంట్ ను ఫ్రూవ్ చేసుకోవాలని ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పాడు. ఉద్యోగం మానేశాక రెండు షార్ట్ ఫిలింస్ చేయగా.. అనుకోకుండా జబర్దస్త్ లో తనకు ఛాన్స్ వచ్చిందన్నాడు.  2016లో ఈ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఇప్పుడు తాను జబర్దస్త్ లో టీం లీడర్ అయ్యానన్నారు. ప్రస్తుతం 100 స్కిట్ లను తాను జబర్దస్త్ లో కంప్లీట్ చేసినట్లు చెప్పాడు.

నవ్వించటంలోని మజాను చెబుతూ.. ఒక రియల్ ఉదంతాన్ని ప్రస్తావించాడు.  ఒక వ్యక్తి చాలా రోజులుగా వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని.. ఎన్ని మాత్రలు వేసుకున్నాఅతని సమస్య తీరలేదని..  అలాంటిది ఒక రోజు జబర్దస్త్ చూశాడని.. చాలాసేపు నవ్వకున్నాడన్నారు. అలాకొద్దిరోజులు షో చూస్తూ నవ్వుకుంటూ ఉండటంతో అతని సమస్య తీరిపోయినట్లు చెప్పాడు. ఇది కల్పించింది కాదని.. నిజంగా జరిగిందన్నాడు. ప్రతిభ ఉంటే ఎలా అయినా బతికేయొచ్చని.. కష్టపడే తత్త్వం ఉంటే ఏ రంగాన్ని ఎంచుకున్నా సక్సెస్ పక్కా అన్నారు.