ఇప్పుడు ఆ ఎన్టీఆరే హాట్ కేక్ అవుతుంది

Sat Feb 23 2019 23:00:01 GMT+0530 (IST)

నందమూరి బాలకృష్ణ నాన్న స్వర్గీయ నందమూరి తారకరామారావుకు గొప్ప నివాళి ఇవ్వాలని తీసిన బయోపిక్ రెండు భాగాలూ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయనే నిజాన్ని నిరూపించడానికే వసూళ్లు సాక్ష్యంగా నిలబడుతున్నాయి. అసంపూర్ణంగా కేవలం రెండో పర్యాయం ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం వరకే చూపించి వదిలేయడం లాంటివి ప్రభావం చూపించడం వల్లే ప్రేక్షకులు దీనికి పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారు. ఇప్పుడు అందరి దృష్టి వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మీదకు మళ్ళుతోంది.స్వయానా వారసుడు తీసిన సినిమానే చూడలేదు జనం. అలాంటిది పెద్దాయనతో ఏ సంబంధం లేని వర్మ చేస్తే చూస్తారా అనే అనుమానాలు పబ్లిక్ లో లేకపోలేదు. అయితే యుట్యూబ్ లో ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ సోషల్ మీడియాలో దీని మీద వ్యక్తమవుతున్న ఆసక్తి అభిప్రాయాలు వెరసి వీలైనంత త్వరగా రిలీజ్ చేస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు చాలా డీసెంట్ ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని వర్మ ఎంత వరకు వాడుకుంటాడో అతని చేతుల్లోనే ఉంది.

క్రమం తప్పకుండా మహానాయకుడుని దెప్పి పొడుస్తూనే తన సినిమాకు కావలసినంత పబ్లిసిటీ ట్విట్టర్ ఫేస్ బుక్ ద్వారా ఫ్రీగా చేసుకుంటున్న వర్మ ఇవాళ కూడా బాలకృష్ణ ఎన్టీఆర్ ఫలితం గురించి మరోసారి తన స్టైల్ లో పంచులు వేసాడు. వీటికి నెటిజెన్ల నుంచి మద్దతు కూడా లభిస్తోంది. ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు ఆయన్ను వెన్నుపోటు పొడిచి గద్దెను దింపడం లాంటి నిజాలే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఉన్నాయని పదే పదే ప్రచారం చేయడం వర్మకు కలిసి వస్తోంది. రెండు ఎన్టీఆర్ లు పోయినా సరే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ధోకా లేదు. వాటిని నిలబెట్టుకుంటాడు అని వర్మని నమ్మలేం కాని ఆ పని చేస్తే మాత్రం రచ్చ మాములుగా ఉండదుగా