రంభకు కోర్టు సమన్లు ఇచ్చింది

Thu Jan 12 2017 10:10:23 GMT+0530 (IST)

సినీ నటి రంభకు ఊహించని పరిణామం ఎదురైంది. పద్మాలయ స్టూడియోలో ఒక డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న వేళ.. ఆ షో షూటింగ్ జరుగుతున్న వేళ.. ఆమెను పోలీసులు కలిశారు. వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరు కాని వైనాన్ని ఆమె దృష్టికి తీసుకొచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. తక్షణమే కోర్టుకు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు జారీ చేశారు.

సినీ నటి రంభ సోదరుడు శ్రీనివాసరావు వివాహం 1999లో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2లో నివసించే పల్లవితో జరిగింది. అయితే.. పెళ్లి జరిగిన 15 ఏళ్ల తర్వాత అత్తింటి నుంచివేధింపులు మొదలైనట్లుగా పల్లవి.. 2014లో నాంపల్లిలోని మూడవ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో భర్త.. అత్తమామలు.. ఆడపడుచు రంభపైనా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో 2014 జులై 21న బంజారాహిల్స్ పోలీసులు రంభతో పాటు భర్త.. అత్తమామలపైనా కేసు నమోదు చేశారు.

అయితే.. అప్పట్లో అమెరికాలో ఉన్న రంభకు సమన్లు జారీ చేయటానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెబుతున్నారు. తాజాగా ఒక ఛానల్ నిర్వహించే డ్యాన్స్ షో కోసం హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుసుకున్న పోలీసులు.. షూటింగ్ జరుగుతున్న పద్మాలయ స్టూడియోస్ కు వెళ్లి.. రంభకు కోర్టు సమన్లు జారీ చేసి వచ్చారు. మరి.. నాంపల్లి కోర్టు మెట్లను ఆమె ఎక్కనుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/