Begin typing your search above and press return to search.

యాడ్లు వేసి చంపార‌ని అలా కోటింగ్ ఇచ్చాడు!

By:  Tupaki Desk   |   21 July 2019 8:16 AM GMT
యాడ్లు వేసి చంపార‌ని అలా కోటింగ్ ఇచ్చాడు!
X
సినిమాక‌ని థియేట‌ర్ కి వెళితే నిమిషాల కొద్దీ స‌మ‌యం ప్ర‌క‌ట‌న‌ల‌(యాడ్స్)తో ఊద‌ర‌గొట్టి చంపేయ‌డం క‌రెక్టేనా? అది క‌రెక్టా కాదా? అన్న‌ది అటుంచితే అంత‌సేపూ మౌనంగా భ‌రించేయ‌డం ప్రేక్ష‌కులు అల‌వాటు ప‌డిపోయారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ఆయ‌న మాత్రం అలా కాదు. నేరుగా పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి ఈ వ్య‌వ‌హారంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవ‌డానికి నిరాక‌రిస్తే అంత‌టితో నిరాశ‌ప‌డ‌కుండా వినియోగ‌దారుల ఫోర‌మ్ ని ఆశ్ర‌యించి చివ‌రికి కేసు ఫైల్ చేయించారు. ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసిన ఆయ‌నెవ‌రు? ఇంత‌కీ ఏ థియేట‌ర్ కి వెళ్లారు? ఏ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేస్తే నిరాక‌రించారు? చివ‌రికి ఈ ఎపిసోడ్ లో అత‌డు నెగ్గారా లేదా? తెలియాలంటే ఇది చ‌ద‌వాల్సిందే.

ఇంత‌కీ ఆ తెగువ చూపించిన ఆయ‌నెవ‌రు? అంటే అత‌డి పేరు విజ‌య్ గోపాల్. అవినీతినిరోధ‌క శాఖ ఉద్యోగి. జూన్ 22న అత‌డు కాచిగూడ‌ ఐనాక్స్ మ‌ల్టీప్లెక్స్ కి వెళ్లారు. థియేట‌ర్ లో సినిమా చూస్తుంటే దాదాపు 20 నిమిషాల పాటు ప్ర‌క‌ట‌న‌ల‌తో న‌స పెట్టించేశార‌ట‌. త‌ల బొప్పి క‌ట్టిన‌ ప్రేక్ష‌కులంతా ఆ థియేట‌ర్ వాళ్ల‌పై మండిప‌డ్డారు. ఆయ‌న‌కు కూడా కాలింది. వెంట‌నే అక్క‌డికి ద‌గ్గ‌రలోనే ఉన్న సుల్తాన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి ఫిర్యాదు చేశార‌ట‌. కానీ పోలీసులు ఇది మా ఏరియా కాదు అంటూ ఫిర్యాదు స్వీక‌రించేందుకు నిరాక‌రించారు. అటుపై అత‌డు నేరుగా వినియోగ‌దారుల ఫోర‌మ్ ని ఆశ్ర‌యించ‌డంతో వాళ్ల ప్ర‌మేయంతో చివ‌రికి కేసు న‌మోదు చేసి ఐనాక్స్ పై ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఐనాక్స్ అంటే దేశ్యాప్తంగా అతి పెద్ద థియేట‌ర్లు- మ‌ల్టీప్లెక్స్ చైన్ వ్య‌వ‌స్థ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌ల లొల్లి కేవ‌లం ఆ ఒక్క ఫ్రాంఛైజీకే కాదు. ఇప్ప‌టికే ఉన్న ఇత‌ర మ‌ల్టీప్లెక్స్ సిస్ట‌మ్ లోనూ ఇదే తంతు. అందుకే స‌ద‌రు అవినీతినిరోధ‌క‌ శాఖ అధికారి అన్ని మ‌ల్టీప్లెక్సుల‌కు వార్నింగ్ ఇచ్చార‌ట‌. అస‌లు మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో ఇలాంటి దందాల‌పై కేసు న‌మోదు చేయాలంటే ఏం చేయాలో సామాన్యుల‌కు అర్థంకాని ఫ‌జిల్ లాంటిది. తినుబండారాల్ని అధిక ధ‌ర‌ల‌కు అమ్మ‌డంపైనా.. మంచి నీళ్ల బ‌దులు కోకో కోలాలే తాగేలా ఆడియెన్ ని బుక్ చేయ‌డంపైనా ఇప్ప‌టికే తీవ్ర‌మైన‌ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజా ఉదంతంతో అలాంటి సంద‌ర్భాల్లో సామాన్యులు కూడా ఎలా ఫిర్యాదు చేయాలో అర్థ‌మైంద‌నే భావించ‌వ‌చ్చు.