Begin typing your search above and press return to search.

బీర్‌ తో సందేశమేంటి సారూ?

By:  Tupaki Desk   |   23 Nov 2018 8:31 AM GMT
బీర్‌ తో సందేశమేంటి సారూ?
X
స‌మాజాన్ని సినిమా ఎంత వ‌ర‌కూ ఉద్ధ‌రిస్తుందో తెలీదు కానీ, నాశ‌నం చేస్తుంది అన‌డానికి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు ప్ర‌త్య‌క్షంగా ఉన్నాయి. సినిమాలు చూసి క్రైమ్ జోన‌ర్‌ లైఫ్‌ స్టైల్ కి అల‌వాటు ప‌డిన వాళ్లు కోకొల్ల‌లు. చెడుదారి ప‌ట్టిన యూత్‌ ని ప‌దే ప‌దే నిరంత‌ర వార్త‌ల్లో చూస్తున్నాం...చ‌దువుతున్నాం. అందుకే సినిమాలు తీసేవాళ్లు బాధ్య‌త‌తో తీయాల‌న్న హెచ్చ‌రిక‌ ఎప్పుడూ ఉండ‌నే ఉంటుంది. అయితే అలాంటి త‌ప్పు చేశారో లేదో తెలీదు కానీ, త్వ‌ర‌లో రిలీజ్‌ కి వ‌స్తున్న `హుషారు`పై మాత్రం ఆ త‌రహా విమ‌ర్శ ఒక‌టి ఉంది.

ఇటీవ‌లే రిలీజైన ఈ సినిమా ట్రైల‌ర్‌ లో యూత్ చెడుదారి ప‌ట్ట‌డం అన్న యాంగిల్‌నే చూపించారు. యువ‌త‌రం క‌ల‌ల హోరులో కొట్టుకుపోతూ అల్ల‌రి చిల్ల‌ర వ‌య‌సులో చెయ్య‌కూడ‌నివి ఎన్నో చేస్తుంటారు. బీర్లు తాగుతూ.. అమ్మాయిల‌తో విచ్చ‌ల‌విడిగా చెల‌రేగిపోతూ.. బూతు సినిమాలు చూస్తూ.. యూత్ అంటే ఇదే అన్న తీరుగా ఉందీ ట్రైల‌ర్. అదొక్క‌టేనా? లైఫ్‌ లో ఎద‌గాలంటే కేవ‌లం బీర్ ఫ్యాక్ట‌రీ పెట్టి బీర్ త‌యారు చేయాలి! అన్న సందేశం కూడా ఈ ట్రైల‌ర్‌ లో ఇచ్చారు. ట్రైల‌ర్ చూడ‌గానే దీనిపై యావ‌గింపు త‌ప్ప ఒక్క పాజిటివ్ మాటా జ‌నాల్లో వినిపించ‌లేదు. ఈ ట్రైల‌ర్‌ ని తిట్టుకున్న వాళ్ల‌లో ఫిలింక్రిటిక్స్ కూడా ఉన్నారు.

`హుషారు` నిర్మాత - ల‌క్కీ మీడియా అధినేత‌ బెక్కం వేణుగోపాల్‌ కి ఇదే విష‌యంపై ఓ ప్ర‌శ్న ఎదురైంది. బీర్ త‌యారు చేయ‌డం - చెడు దారిలో తిర‌గ‌డం ఇదేనా యూత్‌? చివ‌రికి బీర్ ప‌రిశ్ర‌మ పెట్టాలంటున్నారు! ఇదేనా సందేశం అంటే? అని ప్ర‌శ్నిస్తే ఆయ‌న కాసేపు నీళ్లు న‌మిలారు. చెడు దారిలో తిరిగేసే నేటి త‌రం కుర్రాళ్ల క‌థ ఇది. ఇందులో మేం చూపించే సందేశం క‌న్విన్సింగ్‌ గా ఉంటుంద‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ఆయ‌న క‌న్విన్స్ చేసిన విధానం ఏమాత్రం క‌నెక్ట‌వ్వ‌లేదు. త‌ప్పు దారిన‌ వెళ్లొద్ద‌ని సందేశం ఇవ్వాల‌నుకుంటే బీర్ కంపెనీయే పెట్టాలా? అయినా నేటి త‌రం మ‌రీ అంత దారుణంగా చెడిపోయిందా? ఆద‌ర్శవంతంగా ఉండే యూత్ క‌న‌బ‌డ‌రా? పాజిటివ్ యూత్‌ క‌థ‌ను ఎంచుకుని సినిమా చూపించ‌వ‌చ్చు క‌దా! అన్న ప్ర‌శ్న ఎదురైంది. అయితే ఈరోజుల్లో - బ‌స్టాప్ లాంటి నెగెటివ్ స్టోరీలు స‌క్సెస్ సాధించిన‌ప్పుడు అలాంటి ప్ర‌య‌త్న‌మే మ‌రోసారి ఎందుకు చేయ‌కూడ‌ద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావించారా? అన్న సందేహం క‌లిగింది. అయినా ఇదేం సందేశం? మ‌ద్య‌పానం నిషేధించాలి! అని మ‌హిళామ‌ణులు ఉద్య‌మిస్తుంటే.. బీర్ త‌యారు చేయ‌డం అందులో ఉపాధి పొంద‌డం అన్న‌ది సందేశం ఎలా అవుతుంది? యూత్‌ ని చెడు దారి ప‌ట్టించ‌డ‌మే క‌దా? అంటూ జ‌నాల్లో డిబేట్ ర‌న్ అవుతోందిప్పుడు.