Begin typing your search above and press return to search.

వర్మ ఈజ్ బ్యాక్ అంటున్నారే..

By:  Tupaki Desk   |   26 May 2016 11:39 AM GMT
వర్మ ఈజ్ బ్యాక్ అంటున్నారే..
X
చాలా ఏళ్లుగా చెత్త సినిమాలతో విసిగిస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈ ఏడాది ‘కిల్లింగ్ వీరప్పన్’తో మళ్లీ తన టచ్ చూపించాడు. గత ఐదారేళ్లలో వర్మ తీసిన బెస్ట్ మూవీ ఇదే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ సినిమాకు సౌత్ లో వచ్చిన రెస్పాన్స్ చూశాక.. తాను తిరిగి బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన అవకాశంగా భావించినట్లున్నాడు వర్మ. దక్షిణాదిన కేవలం వీరప్పన్ ను చంపే ఆపరేషన్ నేపథ్యంలో సినిమా తీసిన వర్మ.. హిందీలో మాత్రం పూర్తిగా వీరప్పన్ జీవితాన్నే తెరమీదికి తేవాలని నిర్ణయించుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా పూర్తి చేశాడు. కొన్ని నెలల్లోనే విడుదలకు సిద్ధం చేశాడు. ఈ శుక్రవారమే మంచి అంచనాల మధ్య ‘వీరప్పన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రోమోలతోనే జనాల్లో మంచి ఆసక్తి రేకెత్తించిన వర్మ.. సినిమాకు బాగానే హైప్ తీసుకొచ్చాడు. చాన్నాళ్ల తర్వాత వర్మ తీసిన హిందీ సినిమా కావడం.. పైగా ట్రైలర్లు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటం.. ప్రమోషన్ కూడా బాగా చేయడంతో ‘వీరప్పన్’పై బాలీవుడ్ జనాలు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు నిన్న సాయంత్రం ముంబయిలో సినీ ప్రముఖులు.. విమర్శకులకు ‘వీరప్పన్’ ప్రివ్యూ షో వేశారు. చూసిన వాళ్లంతా ‘వర్మ ఈజ్ బ్యాక్’ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు క్రిటిక్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ‘వీరప్పన్’ చాలా బాగుందంటూ పోస్టులు పెట్టారు. కొందరు రివ్యూలు కూడా రాసేశారు. సౌత్ డైరెక్టర్ల గురించి ఎప్పుడూ సెటైర్లు వేసే కమల్.ఆర్.ఖాన్ సైతం ‘వీరప్పన్’ సినిమాకు చాలా మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని చెప్పాడు. మొత్తానికి వర్మ బాలీవుడ్లోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.