చిట్టిబాబు లెక్క బోయపాటికి చిక్కు

Mon Apr 16 2018 21:05:53 GMT+0530 (IST)

రంగస్థలం సక్సెస్ పట్ల ఫాన్స్ తో సహా యూనిట్ మొత్తం ఖుషిగా ఉంది కాని ఒక్క వ్యక్తి మాత్రం తనకు తెలియకుండానే పెద్ద ఒత్తిడి మోయాల్సి వస్తోంది. అతనే దర్శకుడు బోయపాటి శీను. మాస్ పల్స్ కరెక్ట్ గా తెలిసిన అతి కొద్ది దర్శకుల్లో ఒకడిగా పేరున్న బోయపాటి రామ్ చరణ్ కొత్త సినిమాకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ధృవ తర్వాత రామ్ చరణ్ తో బోయపాటి చేసుకుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఎందుకంటే అప్పటికి రామ్ చరణ్ మార్కెట్ వంద కోట్లు దాటుతుంది అనే అంచనా లేదు. సో అంత ఒత్తిడి అనిపించేది కాదు. కాని రంగస్థలం లెక్కలన్నీ పూర్తిగా మార్చేసింది. రామ్ చరణ్ స్టామినా ఓవర్ సీస్ లో కూడా చాటేసింది. రెండు మిలియన్లు వస్తే గొప్ప అనుకుంటే ఏకంగా మూడున్నర మిలియన్లకు చేరువగా వెళ్ళడం చరణ్ సైతం ఊహించనిదే. దీంతో మెగా పవర్ బ్రాండ్ ఇమేజ్ డబుల్ అయ్యింది అనటంలో డౌట్ అక్కర్లేదు.ఇప్పుడు బోయపాటి శీనుని ఖంగారు పెడుతోంది ఇదే. అనూహ్యంగా రామ్ చరణ్ మార్కెట్ పెరిగిపోవడంతో సహజంగానే తన మీద బాధ్యత ఇంకా పెరుగుతుంది. వ్యక్తిగతంగా తన బ్రాండ్ కూడా మార్కెట్ డిమాండ్ ను పెంచుతుంది. సో వాటిని మీట్ కావాలంటే అంత ఈజీ కాదు. అందుకే ఏ విషయంలోనూ రాజీ పడకుండా బోయపాటి చాలా కేర్ తీసుకుంటున్నట్టు టాక్. విలన్ గా వివేక్ ఒబెరాయ్-కీలక పాత్రల్లో జీన్స్ హీరో ప్రశాంత్ సీనియర్ హీరొయిన్ స్నేహాతో పాటు భరత్ అనే నేనుతో డెబ్యు ఇచ్చిన కైరా అద్వానిని తీసుకుని ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీగ సెట్ చేసుకునట్టు తెలిసింది.

ఇక్కడ మరొక చిక్కు కూడా ఉంది. షూటింగ్ ఆలస్యం చేయడానికి లేదు. దసరా లోపే ఫినిష్ చేసేలా టార్గెట్ ఉందని టాక్. రాజమౌళి మల్టీ స్టారర్ కోసం అక్టోబర్ నుంచి రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా మాయం కాబోతున్నాడు. సో ఆలోపలే తాను అనుకున్న అవుట్ పుట్ ని బోయపాటి సమర్ధవంతంగా తక్కువ టైంలోనే తెరకెక్కించాల్సి ఉంటుంది. మరి ఈ ప్రెజర్ ని తట్టుకుని నిలవడం బోయపాటి చేతుల్లోనే ఉంది.