Begin typing your search above and press return to search.

లక్కీ రామ్ గా మార్చిన గీత గోవిందం!!

By:  Tupaki Desk   |   23 Sep 2018 7:16 AM GMT
లక్కీ రామ్ గా మార్చిన గీత గోవిందం!!
X
సినిమా పరిశ్రమలో జరిగే అద్భుతాలు కొన్ని ఊహకు అందవు. అవి జరిగాకే వాటి విలువ తెలుస్తుంది. గీత గోవిందం ఇలాగే ఇప్పుడు ఆ సినిమాలో నటించినవారి పని చేసిన వారి జీవితాలని అమాంతం మార్చేసింది. ఇక దర్శకుడు పరశురామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. విడుదలకు ముందు లాభాల్లో షేర్ తీసుకునే విధంగా అల్లు అరవింద్ తో ఒప్పందం చేసుకున్న పరశురామ్ ఇప్పుడు దాని ద్వారా జరిగిన మంచిని చూసుకుని ఎంత మురిసిపోయినా తక్కువగానే ఉందట. అవును మరి లెక్కలన్ని చూసుకుంటే సుమారు 10 కోట్ల దాకా అందే అవకాశం ఉండగా అందులో సగానికి పైగా వచ్చేసిందట కూడా. మామూలుగా పారితోషికం రూపంలో తీసుకుంటే కనక మహా అయితే కోటి లేదా రెండు కోట్ల లోపే తీసుకునే పరశురామ్ ఏకంగా పదింతలు అందుకోవడం అంటే చిన్న విషయం కాదుగా.గీత గోవిందం ఇండస్ట్రీ హిట్ కావడంతో ఊహించని మొత్తం దక్కడంతో నెక్స్ట్ మూవీకి సైతం ఇదే ఫార్ములాలో వెళ్లే ఆలోచనలో ఉన్నాడట పరశురామ్.

నిజానికి ఇలాంటివి ముందే అనుకుంటే జరిగేవి కావు. ఆ మాటకొస్తే అల్లు అరవింద్ సైతం ఇంత పెద్ద సక్సెస్ ని ఊహించి ఉంటారని చెప్పలేం. అందుకే శాటిలైట్ ని చాలా తక్కువ ధరకు రిలీజ్ కు ముందే అమ్మేసారు. ఇప్పుడు అదే సదరు ఛానల్ కు కామధేనువులా మారబోతోంది. మహానటి-రంగస్థలం కూడా ఆశించిన రేంజ్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా విజయాన్ని అందుకున్న సినిమాలు. సక్సెస్ అయితే ఇలాంటి లెక్కలు ఒప్పందాలకు అనుకూలంగా ఉంటాయి కానీ ఫలితంలో తేడా వచ్చినప్పుడు ఇవే చేతికి రావాల్సిన కాసులకు అడ్డు తగులుతాయి. ఏదైతేనేం మొత్తానికి నక్క తోక తొక్కినట్టు పరశురామ్ అదృష్టం తల తొక్కాడు. తర్వాత సినిమా గీతా ఆర్ట్స్ 2లోనే అని చెబుతున్నప్పటికీ ఏ హీరోతో ఎప్పుడు అనే వివరాలు మాత్రం షేర్ చేసుకోవడం లేదు. మైత్రితో పాటు మంచు బ్యానర్ కు సైతం ఓ సినిమా చేయాల్సిన అగ్రిమెంట్ ఉందని ఇప్పటికే వార్తలు షికారు చేస్తున్నాయి. ఇంకొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.