జెర్సీ రీమేక్ కోసం నువ్వా నేనా ?

Tue Apr 23 2019 11:43:53 GMT+0530 (IST)

ఒక బాషలో ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ అయితే దాని రీమేక్ హక్కుల కోసం పక్క రాష్ట్రాల వాళ్ళు పోటీ పడటం సర్వ సాధారణం. ఇంతకు ముందు మనవాళ్ళు ఎక్కువగా తమిళ సినిమాల మీద ఆధారపడి ఉదయం ఆటకు హిట్ టాక్ వస్తే చాలు అడ్వాన్సులు పట్టుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. గత కొంత కాలంగా సీన్ రివర్స్ లో నడుస్తోంది. టాలీవుడ్ హిట్స్ కోసం ముంబై బెంగుళూరు చెన్నై నుంచి ప్రొడ్యూసర్లు చెక్కులతో దిగుతున్నారు. గీత గోవిందం-ఆరెక్స్ 100-గూడచారి-టాక్సీ వాలా లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.ఇప్పుడు జెర్సీ వంతు వచ్చింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన జెర్సీలోని ఎమోషన్ కి ప్రేక్షకులు క్యు కడుతున్నారు. పబ్లిక్ టాక్ ఇంత పాజిటివ్ టాక్ గా రావడం ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ చూడలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు జెర్సీ రీమేక్ కోసం పోటీ విపరీతంగా ఉందని టాక్

హింది వెర్షన్ కోసం కరణ్ జోహార్ ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. ఓసారి చూశాక నిర్ణయించుకుంటానని హిందిలో వర్క్ అవుట్ అవుతుందనిపిస్తే ఎంత మొత్తమైనా పెట్టేందుకు రెడీగా ఉన్నట్టు ఫీలర్ వదిలారట. మరోవైపు బాలీవుడ్ లో దీని రీమేక్ తానే ఎందుకు చేయకూడదు అనే ఆలోచన దిల్ రాజుకే వచ్చినట్టు మరో న్యూస్ వచ్చింది.

తమిళ్ లో లైకా సంస్థ ఆసక్తి చూపుతుండగా కన్నడ నుంచి రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి ప్రతిపాదన వచ్చినట్టు శాండల్ వుడ్ టాక్. ఇలా ఇందరేసి నిర్మాతలు రీమేక్ కోసం పోటీ పడటం అంటే చిన్న విషయం కాదుగా. జెర్సీ ప్రొడ్యూసర్స్ ఇంకా ఎవరికి కమిట్ కాలేదు. ఇంకొద్ది రోజులు ఆగాక అప్పుడు చూద్దామని అనుకుంటున్నట్టు తెలిసింది