బాహుబలి బాటలో భారీ బడ్జెట్ సినిమాలు

Fri May 19 2017 16:23:22 GMT+0530 (IST)

బాహుబలి ఘన విజయం సాధించటంతో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ భారీ బడ్జెట్ సినిమాలపై కన్నేస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి సక్సెస్ లో మార్కెటింగ్ టెక్నిక్స్ మిళితమై ఉండడంతో తామూ పెద్ద సినిమాలతో పెద్ద లాభాలు గడించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్ రోబో సీక్వల్ సెట్స్ మీద ఉండగా సంఘమిత్ర ప్రారంభమైంది. అల్లు అరవింద్ రామాయణాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా మరో భారీ చిత్రంపై చర్చ మొదలైంది.
    
ప్రస్తుతం మహేష్ తో స్పైడర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మురుగదాస్ తరువాత కూడా భారీ బడ్జెట్ చిత్రాన్నే ప్లాన్ చేస్తున్నాడట. తుపాకీ - కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన విజయ్ కాంబినేషన్ లో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నాడు.
    
మురుగదాస్ మార్క్ సోషల్ ఎలిమెంట్ తో పాటు విజయ్ స్టైల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రోబో తరువాత సినిమా నిర్మాణానికి దూరమైన సన్ పిక్చర్స్ మురుగదాస్ - విజయ్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తోంది. దాదాపు 120 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మరి ఈ సినిమాలన్నీ బాహుబలులవుతాయో లేదంటే బలవుతాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/