Begin typing your search above and press return to search.

హృతిక్ వాడేశాడు..గోపీచంద్ ఏం చేస్తాడు?

By:  Tupaki Desk   |   24 Oct 2016 7:30 AM GMT
హృతిక్ వాడేశాడు..గోపీచంద్ ఏం చేస్తాడు?
X
గోపీచంద్ హీరోగా భూపతి పాండ్యన్ అనే తమిళ దర్శకుడు ఎప్పుడో మూడేళ్ల కిందట ఓ సినిమా మొదలుపెట్టాడు. నయనతార కథానాయిక. ఐతే భూపతి టేకింగ్ నచ్చక ఈ సినిమా మధ్యలో అతణ్ని తప్పించేశారు. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ లైన్లోకి వచ్చాడు. ‘జగన్మోహన్ ఐపీఎస్’ పేరుతో ఈ సినిమాను కంటిన్యూ చేశారు. కానీ సినిమా చివరి దశలో మళ్లీ దీనికి బ్రేక్ పడింది. రెండేళ్లుగా ఈ ప్రాజెక్టును పక్కబెట్టేశారు. ఇక ఈ సినిమా బయటికి రావడం కష్టమే అనుకుంటుంటే.. ఉన్నట్లుండి ఈ మధ్య మళ్లీ రివైవ్ చేశారు. దీపావళికి ఈ సినిమా కొత్త టైటిల్ ప్రకటిస్తామని.. డిసెంబర్లో సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటన ఇచ్చాడు నిర్మాత.

యజ్నం.. శౌర్యం.. లౌక్యం.. లాంటి గోపీచంద్ సినిమాల తరహాలో ఈ చిత్రానికి సెంటిమెంటుగా ‘బలం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇంతలో ఓ హిందీ డబ్బింగ్ సినిమాకు ఈ పేరు వాడేశారు. హృతిక్ రోషన్ కొత్త సినిమా ‘కాబిల్’ను తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘బలం’ అనే టైటిల్ అనౌన్స్ చేసేశారు. గోపీ సినిమా టైటిల్ లోగో కూడా రెడీ చేసేసి దీపావళికి గ్రాండ్ లాంచ్ ప్లాన్ చేస్తుంటే హృతిక్ సినిమా వాళ్లు ఇలా షాకిచ్చేశారు. మరి ఈ టైటిల్ ముందు ఎవరు రిజిస్టర్ చేయించారో తెలియాలి. ఎలాగూ ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు కాబట్టి.. గోపీచంద్ సినిమా నిర్మాతే టైటిల్ మార్చుకుంటాడేమో చూడాలి. ఇక హృతిక్ సినిమా విషయానికి వస్తే.. అతడి తండ్రి రాకేష్ రోషన్ నిర్మిస్తున్న ‘కాబిల్’కు సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/