Begin typing your search above and press return to search.

ఫోకస్: దయ్యాలు చిరాకెత్తించేస్తున్నాయ్

By:  Tupaki Desk   |   6 Feb 2016 5:30 PM GMT
ఫోకస్: దయ్యాలు చిరాకెత్తించేస్తున్నాయ్
X
ట్రెండు సృష్టించడం కాదు.. ట్రెండు ఫాలో అయిపోవడమే పరిశ్రమలో ఎక్కువమంది చేసే పని. ఆల్రెడీ హిట్టయిన సినిమాల బాటలో ఫార్ములాను పట్టుకుని సేఫ్ గేమ్ ఆడేయడానికే చాలామంది ట్రై చేస్తుంటారు. ఒక కొత్త తరహా సినిమా హిట్టయిందంటే చాలు.. ఇక దాన్నే పట్టుకుని పరుగులు తీయడం మనోళ్లకు బాగా అలవాటు. రెడీ - కిక్ తరహా సినిమాలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయ్యాయి. ఇక అందరూ వాటినే పట్టుకుని వేలాడారు. ఆ టైపు సినిమాలు మొహం మొత్తి చివరికి రభస - బ్రూస్ లీ - సౌఖ్యం లాంటి సినిమాల్ని గట్టిగా తిప్పికొట్టారు ప్రేక్షకులు. ఇప్పుడు హార్రర్ కామెడీ సినిమాల పరిస్థితి కూడా ఇలాగే అయ్యేలా కనిపిస్తోంది. దయ్యం అంటే భయం పోయి.. దయ్యం సినిమాలంటే దండం పెట్టేసే పరిస్థితి వచ్చేస్తోందిప్పుడు.

ఇంతకుముందు హార్రర్‌ సినిమాలంటే హార్రర్‌ సినిమాలే. భయపెట్టడం తప్ప వేరే ఉద్దేశం ఉండేది కాదు. ఐతే 'కాంఛన' సినిమాతో పరిస్థితి మారిపోయింది. హార్రర్‌ కామెడీ అనే కొత్త జానర్‌ జనాలకు పరిచయమైంది. ఇంతకుముందు కూడా హార్రర్‌ సినిమాల్లో కొంచెం కామెడీ ఉండేది కానీ.. అది పెద్దగా హైలైట్‌ అయ్యేది కాదు. కానీ కేవలం కామెడీ ప్రధానంగా హార్రర్‌ చిత్రాలు తెరకెక్కడం 'కాంఛన'తోనే మొదలైంది. ఆ తర్వాత 'ప్రేమకథా చిత్రమ్‌'తో ఈ ట్రెండు మరింత ఊపందుకుంది. చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్‌ హిట్టయి భారీగా వసూళ్లు కురిపించడంతో ఇక అందరూ హార్రర్‌ కామెడీల బాట పట్టారు. గీతాంజలి - బూచమ్మ బూచోడు - త్రిపుర - రాజుగారి గది.. ఇలా హార్రర్‌ కామెడీలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. వీటిలో మెజారిటీ సినిమాలు హిట్టయ్యాయి. ప్రేమకథా చిత్రమ్‌ తమిళంలోకి 'డార్లింగ్‌' పేరుతో రీమేక్‌ అయి అక్కడ కూడా విజయం సాధించడంతో ఈ టైపు సినిమాలకు కోలీవుడ్ లో కూడా గిరాకీ పెరిగింది. అక్కడ ఆరణ్మయి - ఆరణ్మయి-2 అంటూ రెండు సినిమాలొచ్చాయి. ఇవి రెండూ మంచి విజయం సాధించాయి. మరోవైపు లారెన్స్‌ తన 'కాంఛన'కు కొనసాగింపుగా తీసిన కాంఛన-3 కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్టయింది. ఆరణ్మయి - ఆరణ్మయి-2 - కాంఛన-3 తెలుగులోకి అనువాదమై మన ప్రేక్షకుల్ని మెప్పించాయి.

హార్రర్‌ కామెడీలు బాగానే ఆడేస్తున్నాయి. మంచి వసూళ్లే సాధిస్తున్నాయి కానీ.. ఈ సినిమాలతో పెద్ద చిక్కొచ్చి పడింది. అన్నీ ఒకే తరహా కథలతో తెరకెక్కుతూ విసిగించేస్తున్నాయి. ఓ అమ్మాయిని అన్యాయంగా ఎవరో చంపేస్తారు.. ఆ అమ్మాయి దయ్యమై ఓ ఇంట్లోకి చేరుతుంది. అక్కడ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఇంటర్వెల్‌ సమయానికి దయ్యం గుట్టు తెలుస్తుంది. ద్వితీయార్ధంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మొదలవుతుంది. అదయ్యాక మెయిన్‌ విలన్‌ పని పట్టడం. కథ సుఖాంతం. ఇదీ చాలా వరకు హార్రర్‌ కామెడీల్లో కనిపిస్తున్న కథ. దయ్యం ఓ కామెడీ బ్యాచ్‌ ను పట్టుకుని ఉతికారేయడం అన్నది అన్ని సినిమాల్లో కామన్‌ అయిపోయింది. ఈ ఉతుకుడు కామెడీనే మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తూ జనాలకు మొహం మొత్తేలా చేస్తున్నారు. అందులోనూ లేటెస్ట్‌ హార్రర్‌ కామెడీ 'కళావతి' అయితే.. దాని ప్రీక్వెల్‌ 'చంద్రకళ' సినిమాకు డిట్టోలా అన్నట్లు తయారైంది. ఐతే కలెక్షన్లు వస్తున్నాయి కదా అని మళ్లీ మళ్లీ అవే సినిమాలు తీసి జనాల మీదికి వదలడం ఎంతవరకు సమంజసమో దర్శక నిర్మాతలు ఆలోచించాలి. రెడీ తరహా సినిమాల పరిస్థితి ఇప్పుడేమైందో చూస్తూనే ఉన్నాం. హార్రర్ కామెడీలకు కూడా అలాంటి పరిస్థితి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. కాబట్టి ఈ తరహా సినిమాలకు ఇకనైనా సెలవు పలికితే బెటర్.