రాజమౌళిని ఆకర్షించిన ‘అల్లూరి’ చరిత్రేంటి?

Thu Mar 14 2019 15:52:38 GMT+0530 (IST)

జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ గురించి మొత్తం విశేషాలను ఈరోజు వెల్లడించారు. ఇద్దరు తెలుగు పోరాట యోధుల చరిత్రను తెరపై ఆవిష్కరిస్తున్నట్టు వెల్లడించారు. అందులో ఒకరు తెలంగాణ పోరుబిడ్డ కొమురం భీం కాగా.. రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బ్రిటీషర్లను ఎదురించిన మన్యం వీరుడు అల్లురి సీతారామారాజు. వీరి చరిత్రను జక్కన్న తెరపై ఆవిష్కరించబోతున్నారు. ప్రపంచానికి తెలుగువీరుల చరిత్ర ఇదీ అని చాటబోతున్నారు. ఇంతకీ ఈ వీరులెవరు? వీరి చరిత్ర ఏంటి.? రాజమోళి టేకప్ చేసేంత క్యూరియాసిటీ ఈ వీరుల జీవిత చరిత్రలో ఏముందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.*మన్యం వీరుడు అల్లూరి..
అల్లూరి గురించి ఇదివరకే తెలుగులో చాలా సినిమాలొచ్చాయి.. పుస్తకాలున్నాయి.. సూపర్ స్టార్ కృష్ణ తీసిన అల్లూరి సీతారామారాజు మూవీ అయితే ఎవర్ గ్రీన్. మరి అంతా తెరిచిన పుస్తకంలా ఉన్నా అల్లూరి చరిత్రను రాజమౌళి ఎందుకు టేకప్ చేశారు. అందులో ఏ కోణాన్ని ఆవిష్కరించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

*అల్లూరి చరిత్ర ఇదే..
అల్లూరి సీతారామారాజు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక బట్టేలంక లో స్థిరపడ్డారు.కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంతో అల్లూరి కుటుంబం అప్పనపల్లికి వలసవచ్చింది.  అల్లూరి సీతారామారాజు  1897 జూలై 4న పాండ్రంగి గ్రామంలో వెంకట రామరాజు-సూర్యనారాయణమ్మలకు జన్మించాడు. వీరికి ఆరుగురు కుమారుల్లో సీతారామారాజు ఒకరు. ఈయన అసలు పేరు ‘శ్రీరామరాజు’. 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా కలరా ప్రబలి సీతారామారాజు తండ్రి మరణించాడు. ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోయిన రాజు జీవితంలో పెనుమార్పులొచ్చాయి.  పేదరికంతో వివిధ ప్రదేశాలకు సీతారామారాజు కుటుంబం 1918లో తునికి చేరింది.. అక్కడే చుట్టుపక్కల కొండలు అడవుల్లో తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనించాడు. ఆరోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని బ్రిటీష్ దొరల దురాగతాలను దోపిడీలను అన్యాయాలను ఎదురించడం మొదలు పెట్టాడు. చుట్టుపక్కల 30 నుంచి 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడై గిరిజనులు దోపిడీకి గురికాకుండా వారికి యుద్ధవిద్యలు నేర్పి గెరిల్లా పద్ధతులు నేర్పాడు. బాస్టియన్ అనే బ్రిటీష్ తహసీల్దార్ దోపిడీని ఎదురించాడు. అతడు బ్రిటీషర్లకు రామరాజు విప్లవ ఉద్యమాలు చేస్తున్నాడని నివేదికలు పంపాడు. దీంతో సీతారామారాజును బ్రిటీష్ ప్రభుత్వం గిరిజనులకు దూరంగా నర్సీపట్నం అడ్డతీగల ప్రాంతంలో పోలీసుల నిఘాలో ఉంచింది. 1922లో తిరిగి తప్పించుకొని మన్యంలోకి సీతారామరాజు అడుగుపెట్టాడు.

150మంది వరకు విప్లవ గిరిజన వీరులను సమీకరించి పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లాడు. ఆగస్టు 22 1922లో మన్యం విప్లవం ఆరంభమైంది. ఇలా బ్రిటీష్ వారిపై దాడులు ప్రతిదాడులతో మన్యంలో రామరాజు సామాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. కానీ 1924లో మన్యానికి రూథర్ ఫర్డ్ కలెక్టర్ గా వచ్చాక విప్లవాలను అణిచివేశాడు. మన్యం ప్రజలను రూథర్ ఫర్ట్ ఎంతో హింసాడు. సీతారామారాజు అనుచరులను చంపడం.. పట్టుకున్న వారిని అండమాన్ జైలుకు పంపాడు.  దీంతో లొంగిపోవాలని నిశ్చయించుకున్న సీతారామారాజు 1924 మే 7న కొయ్యూరు గ్రామసమీపంలో ఉన్నానని బ్రిటీషర్లకు కబురు పంపాడు. పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. బంధీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఏ విచారణ లేకుండా కాల్చిచంపారు. కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరి అమరడవ్వడం విశేషం.

చిన్న వయసులోనే అల్లూరి సీతారామరాజు గిరిజనుల దోపిడీపై విప్లవ పంథాను ఎంచుకొని పోరాడారు. మధ్యలో 1916లో ఏప్రిల్ 26న ఉత్తర భారత దేశ యాత్రను చేశాడు. 1918లో తిరిగి మన్యంచేరాడు. ఇలా అల్లూరి జీవితంలో ఎన్నో స్ఫూర్తినిచ్చే సంఘటనలున్నాయి. ఈ కథను వెండితెరపై ఆవిష్కరిస్తున్న రాజమౌళికి స్పైసీ కంటెంట్ దొరికింది. దీన్ని తెరపై ఎలా ఆవిష్కరిస్తాడన్నది వేచిచూడాల్సిందే.